ఫేక్ న్యూస్ పై టీటీడీ సీరియస్.. ఆ సందేశాలకు చెక్!

రెండు తెలుగు రాష్ట్రాలేకాక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల భ‌క్తులు తిరుమ‌ల వెంకటేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. క‌రోనా కంటే ముందు ల‌క్ష‌ల సంఖ్య‌లో స్వామివారిని భ‌క్తులు ద‌ర్శించుకునేవారు.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:18 PM IST

రెండు తెలుగు రాష్ట్రాలేకాక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల భ‌క్తులు తిరుమ‌ల వెంకటేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. క‌రోనా కంటే ముందు ల‌క్ష‌ల సంఖ్య‌లో స్వామివారిని భ‌క్తులు ద‌ర్శించుకునేవారు. అయితే క‌రోనా కార‌ణంగా స్వామి వారి ద‌ర్శ‌నానికి ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తున్నారు. రోజుకి సుమారు 20వేల మంది భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు.అయితే ఇటీవ‌ల ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు, వృద్ధులు, శారీర‌క విక‌లాంగుల ప్ర‌త్యేక ద‌ర్శ‌న స్లాట్‌ల‌ను ర‌ద్దు చేశారంటూ సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల‌పై వైర‌ల్ అవుతున్నాయి. అయితే వీటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) భ‌క్తుల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. దీనిపై మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌ను టీటీడీ విడుద చేసింది. ప్రత్యేక ద‌ర్శ‌నాల‌ను ఇప్ప‌టివ‌ర‌కు ర‌ద్దు చేయ‌లేద‌ని టీటీడీ పేర్కొంది.

క‌రోనా మ‌హామ్మారి స‌మ‌యంలోనే ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు నిలిపివేయ‌బ‌డ్డాయ‌ని వాటిని పునః ప్రారంభించే నిర్ణ‌యం ఇప్ప‌టివ‌ర‌కు తీసుకోలేద‌ని టీటీడీ తెలిపింది. సోష‌ల్ మీడియాలో టీటీడీపై అనేక సందేశాలు వైర‌ల్ అవుతున్నాయ‌ని, ఈ సందేశాల ద్వారా భ‌క్తులు త‌ప్పుదోవ‌ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని టీటీడీ అభిప్రాయ ప‌డింది. వృద్ధులు, శారీరక వికలాంగులు మరియు ఇతర వర్గాలకు ప్రత్యేక దర్శన్ స్లాట్‌లను అందించడంపై టీటీడీ నిర్ణయం తీసుకుంటుంద‌ని…ఈ నిర్ణయం అధికారికంగా భ‌క్తుల‌కు తెలియజేస్తామ‌ని టీటీడీ పేర్కొంది. అప్పటి వరకు, భక్తులు సోషల్ మీడియాలో వ‌చ్చే సందేశాల‌ను న‌మ్మోద్ద‌ని టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది.

తిరుమ‌ల వెంకటేశ్వ‌ర‌స్వామిపై సోష‌ల్ మీడియాలో అనేక సందేశాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇవి ఫేక్ సందేశాలుగా టీటీడీ అధికారులు గుర్తిస్తున్నారు. ప్ర‌తిసారి స్వామివారి ద‌ర్శ‌నాల‌పై కానీ ప్ర‌సాదాల‌పై కానీ ఆస్తుల‌పై కానీ సోష‌ల్ మీడియాలో ఇలాంటి ప్ర‌చారం ఎక్కువ‌గా జ‌రుగుతుందిని టీటీడీ అధికారులు అంటున్నారు.గ‌తంలో స్వామి వారి ఆస్తుల‌పై కూడా సోష‌ల్ మీడియాలో ఫేక్ ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు తాజ‌గా స్వామి వారి ద‌ర్శ‌నాల‌పై కూడా సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని టీటీడీ ఖండించింది.