త‌మిళ‌నాడు వైపు.. టీఆర్ఎస్ చీఫ్ చూపు!

తెలంగాణ రాష్ట్ర స‌మిత (టీఆర్ఎస్‌) 20ఏళ్ల‌ను పూర్తి చేసుకోబోతోంది. ఉప ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ రెండు ద‌శాబ్దాలుగా తెలంగాణ అంతటా వ్యాపించింది. ఏడేళ్ల నుంచి అధికారంలో ఉంది.

  • Written By:
  • Publish Date - October 22, 2021 / 11:13 AM IST

తెలంగాణ రాష్ట్ర స‌మిత (టీఆర్ఎస్‌) 20ఏళ్ల‌ను పూర్తి చేసుకోబోతోంది. ఉప ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ రెండు ద‌శాబ్దాలుగా తెలంగాణ అంతటా వ్యాపించింది. ఏడేళ్ల నుంచి అధికారంలో ఉంది. న‌వంబ‌ర్ 15వ తేదీన పెద్ద ఎత్తున 20ఏళ్ల ప్ర‌స్థానం పండ‌గ చేసుకోవ‌డానికి సిద్ధం అవుతోంది. ఇదంత ఒక ఎత్తు అయితే, భ‌విష్య‌త్ లో పార్టీని ఎలా బ‌లోపేతం చేయాల‌నేదానిపై కేసీఆర్, కేసీఆర్ పూర్తి స్థాయి అధ్య‌య‌నం చేయ‌డానికి సిద్దం అయ్యారు. త‌మిళ‌నాడులోని డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు ఎలా దీర్ఘ‌కాలంపాటు రాజ‌కీయాలు చేస్తున్నాయ‌నే అంశంపై స్ట‌డీ చేయడానికి కేటీఆర్ అండ్ టీం సిద్ధం అయింది. ఆ మేర‌కు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశించారు. ఈనెల 25వ తేదీన పార్టీ ప్లీన‌రీ ముగిసిన త‌రువాత పార్టీ భ‌విష్య‌త్ కోసం ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్ట‌బోతున్నారు.

ఇటీవ‌ల హైద్రాబాద్ వ‌చ్చిన డీఎంకేకు చెందిన ముగ్గురు ఎంపీల‌తో కేటీఆర్ చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.  న‌వంబ‌ర్ 15వ తేదీన వ‌రంగ‌ల్ స‌భ ముగిసిన త‌రువాత త‌మిళ‌నాడుకు ప్ర‌త్యేక టీఆర్ఎస్ టీం వెళ్ల‌నుంది. అక్క‌డ డీఎంకే సంస్థ‌గ‌త నిర్మాణం మీద తొలుత అధ్య‌య‌నం చేస్తోంది. ప్రాంతీయ పార్టీగా విజ‌య‌వంతంగా నాలుగు ద‌శాబ్దాలు న‌డుస్తోన్న వైనాన్ని ఆ టీం ప‌రిశీలించ‌నుంది. ఆ త‌రువాత ఏఐఏడీఎంకే సంస్థాగ‌త నిర్మాణం, ఆ పార్టీ ఎదుర్కొన్న ఒడిదుడ‌కులు త‌దిత‌రాల‌ను తెలుసుకోనుంది. ప్ర‌త్యేకించి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌రువాత పార్టీలో నెల‌కొన్ని సంక్షోభంపై అధ్య‌య‌నం చేయ‌బోతున్నారు.

ఆ ప‌రిస్థితుల్లో సంస్థాగ‌తంగా పార్టీలో ఎలాంటి ఒడిదిడుకులు లేకుండా సాగిపోవ‌డంపై కేటీఆర్ అండ్ టీం అధ్య‌య‌నం చేయ‌నుంది. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ భ‌విష్య‌త్ కు ముందుగానే అన్ని ర‌కాలు హంగుల‌ను కూడ‌గ‌ట్ట‌కుంటోంది. అధికారం కోల్పోయిన‌ప్ప‌టికీ పార్టీ సంస్థాగ‌తంగా ఎలా స్థిరంగా ఉండ‌గ‌ల‌దు అనే అంశంపై దృష్టి పెట్టింది. ఇదంతా కేటీఆర్ ను ముఖ్య‌మంత్రి చేసిన త‌రువాత వ‌చ్చే ప‌రిణామాల‌కు ముంద‌స్తు క‌స‌ర‌త్తు అంటూ కొంద‌రు పార్టీలోని నేత‌లు చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీలో బాస్ చెప్పిందే వేదం..కాబ‌ట్టి త‌మిళ‌నాడులోని డీఎంకే, ఏఐడీఎంకే మోడ‌ల్ ను టీఆర్ఎస్ అనుస‌రించ‌నుంద‌న్న‌మాట‌.