Transgender: ట్రాన్స్‎జెండర్ జంటకు బిడ్డ.. ఇండియాలో తొలిసారి!

ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పదం. అయితే ఇది కేవలం ఆడ, మగ వరకే మాత్రమే పరిమితం కాగా.. ట్రాన్స్ జెండర్లు తమ హక్కుల కోసం గళం ఎత్తుతున్నారు.

  • Written By:
  • Publish Date - February 8, 2023 / 08:04 PM IST

Transgender: ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పదం. అయితే ఇది కేవలం ఆడ, మగ వరకే మాత్రమే పరిమితం కాగా.. ట్రాన్స్ జెండర్లు తమ హక్కుల కోసం గళం ఎత్తుతున్నారు. ఇలాంటి తరుణంలోనే ఓ ట్రాన్స్ జెండర్ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఎక్కడో విదేశాల్లో కాదు, మన దేశంలోనే, మన దక్షిణాదిలోనే. ఆ స్టోరీ ఏంటో చూద్దాం.

కేరళలోని కోయిక్కోడ్ కు చెందిన ట్రాన్స్ జెంటర్ జంట.. జహాద్, జియా పావల్ లు మూడు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. జహాద్, జియా పావల్ లు బిడ్డను కనడానికి ముందు బేబీ బంబ్ తో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ జంట పండంటి బిడ్డకు జన్మనివ్వగా.. జహాద్, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కోయిక్కోడ్ మెడికల్ కాలేజీలో జహాద్ బిడ్డకు జన్మనిచ్చింది.

జియా పావల్ తన లింగాన్ని మార్చుకొని స్త్రీగా మారగా.. జహాద్ ఆడపిల్లగా పుట్టి మగాడిలా మారాడు. అయితే ఆడ నుండి మగగా మారే క్రమంలో గర్భాశయం, మరికొన్ని అవయవాలు తొలగించకపోవడంతో జహాద్ గర్భం దాల్చింది. ఐవీఎఫ్ విధానం ద్వారా జహాద్ గర్భం దాల్చగా.. మొదటి మూడు నెలలు జహాద్ తన శరీరంలో చాలా మార్పులను గమనించాడు.

మార్చిలో డెలివరీ ఉన్నా వైద్య కారణాల వల్ల ముందే సర్జరీ చేయాల్సి వచ్చిందన్న వైద్యులు.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే జహాద్ కు వైద్యులు సర్జికల్ డెలివరీ చేశారు. కాగా దేశంలో ఇలా ట్రాన్స్ జెండర్లు బిడ్డకు జన్మనివ్వడం తొలిసారి కాగా.. దీనిపై జియా పావల్, జహాద్ లు ఆనందం వ్యక్తం చేశారు. తమ బిడ్డ భవిష్యత్తు విషయంలో తమకు ఎలాంటి భయాందోళన లేదని ఇద్దరూ ప్రకటించారు.