Site icon HashtagU Telugu

Lavanya’s death: స్టూడెంట్ లావ‌ణ్య మ‌ర‌ణంపై అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు!

Lavanya

Lavanya

తంజావూరుకు చెందిన 12వ తరగతి విద్యార్థిని లావణ్య జనవరి 19న ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని మృతికి మ‌త మార్పిడే కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. విద్యార్థిని క్రైస్తవ మతంలోకి మారాలని ఒత్తిడి తీసుకురావ‌డం వ‌ల్లే బాలిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడినట్లు బీజేపీ ఆరోపించింది. తంజావూరులోని తిరుకట్టుపల్లికి చెందిన లావణ్య తంజావూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి జనవరి 19న మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తంజావూరు ఎస్పీ ర‌వ‌ళి ప్రియ‌ తెలిపారు.త‌న కుమార్తెను చిత్రహింసలు పెట్టారని లావ‌ణ్య తండ్రి మురుగానందం ఆరోపించారు. మతం మార్చుకోవడానికి త‌న కూతురు నిరాక‌రించిందని.. దీంతో ఆమెను ఇబ్బందుల‌కు గురి చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే సోష‌ల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న 44 సెకన్ల క్లిప్‌ను ఎవరు చిత్రీకరించారనే దానిపై స్పష్టత లేదని ఎస్పీ తెలిపారు. ఈ వీడియోలో హాస్ట‌ల్ వార్డెన్ త‌న‌ను మ‌తం మారాలంటూ ఒత్తిడి చేశార‌ని ఆమె ఆరోపించింది.

ఈ ఘ‌ట‌న‌పై లావ‌ణ్య త‌ల్లిదండ్రులు జ‌న‌వ‌రి 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్ట‌ల్ వార్డెన్ త‌న కూతురితో ఇంటి ప‌నులు చేయిస్తున్నార‌ని ..అకౌంట్ బుక్స్ మెయింటెయిన్ చేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నార‌ని ఆరోపించారు. జనవరి 16న సాయంత్రం 4.10 గంటలకు లావణ్య చివరి ప్రకటనను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వీడియోలో రికార్డ్ చేయ‌గా.. జ‌న‌వరి 19న మరణించారు కాబట్టి మేజిస్ట్రేట్‌కి ఆమె చేసిన వాంగ్మూలాన్ని మేము చివరి ప్రకటనగా భావిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అయితే, జనవరి 20న, తల్లిదండ్రులు ఈ చిన్న క్లిప్‌తో మమ్మల్ని సంప్రదించారని.. మొదటి ఫిర్యాదులో బాలిక మరణ ప్రకటనలోనూ మతమార్పిడి ప్రయత్నాన్ని ప్రస్తావించలేదని ఎస్పీ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేసి విచార‌ణ జ‌రుపుతామ‌ని ఎస్పీ తెలిపారు.

Exit mobile version