TN CM Son Rise: ఉదయనిధిని మంత్రిని చేయడానికి రంగం సిద్ధం.. ఈనెలలోనే కీలక ఘట్టం?

తమిళనాడులో చినబాబుకు మంత్రి పదవి ఖాయం. దానికి ఏడాదిగా ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేస్తూ వచ్చారు సీఎం స్టాలిన్.

  • Written By:
  • Updated On - May 8, 2022 / 07:17 PM IST

తమిళనాడులో చినబాబుకు మంత్రి పదవి ఖాయం. దానికి ఏడాదిగా ప్లాట్ ఫామ్ ను సిద్ధం చేస్తూ వచ్చారు సీఎం స్టాలిన్. డీఎంకే అధికారంలోకి వచ్చి ఈ నెల 7వ తేదీ నాటికి సంవత్సరం పూర్తవుతుంది. అందుకే ఆ సందర్భంగా ఆయన కుమారుడు ఉదయనిధిని మంత్రిని చేసేలా పావులు కదిపారు. అందుకే పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందు లేకుండా అంతా రెడీ చేశారు.

చేపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు ఉదయనిధి. అప్పటి నుంచి పార్టీలో, ప్రభుత్వంలో కీరోల్ పోషిస్తున్నారు. కానీ గత లోక్ సభ ఎన్నికల్లో పార్టీకోసం ఆయన చేసిన ప్రచారం బాగా కలిసొచ్చింది. పైగా ఆ ఎన్నికల్లో ఒక్క సీటు మినహా.. అన్ని ఎంపీ స్థానాల్లోను డీఎంకే గెలిచింది. దీంతో పార్టీపై ఉదయనిధి పట్టు పెరిగింది.

శాసనసభ ఎన్నికల్లో అయితే ఓ ఇటుక పట్టుకుని.. మదురై ఎయిమ్స్ కు చెందిన ఇటుక ఇదేనంటూ విమర్శలతో చేసిన ప్రసంగం కూడా ప్రజలతోపాటు నాయకులనూ ఆకట్టుకుంది. డీఎంకే క్యాంపైన్ లోనే ఇది హైలెట్ గా నిలిచింది. మొత్తానికి అలా శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఉదయనిధి సినిమాలను తగ్గించుకున్నారు. రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికైతే పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే కుమారుడికి మంత్రి పదవి ఇస్తే.. దానివల్ల విపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టవుతుంది. అందుకే ఉదయనిధిని ముందుగా నియోజకవర్గం డెవలప్ మెంట్ పైనే శ్రద్ధ పెట్టమన్నారు. దీంతో ఆయన కూడా అదే పని చేశారు. ఎప్పటికప్పుడు మంత్రులను కలుస్తూ.. అధికారులతో మాట్లాడుతూ అక్కడి పనులను చేయిస్తున్నారు. దీంతో మంత్రులు కూడా ఆయనను మంత్రిగా చేయాలని స్టాలిన్ పై ఒత్తిడి తెస్తున్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఇస్తున్నట్టే.. ఉదయనిధికి కూడా గౌరవ మర్యాదలు అందుతున్నాయి. ఆయనకు మంత్రివర్గంలో పురపాలక శాఖ కేటాయించే ఛాన్సుంది. దానివల్ల రాష్ట్రంలో కీలకమైన శాఖ ఆయన పరం చేసినట్లవుతుంది. పైగా రాష్ట్రం మొత్తం మీద ఆయనకు పట్టు చిక్కుతుంది. మొత్తానికి సినిమా నటుడు నుంచి మంత్రిగా ఉదయనిధికి ఛాన్స్ వచ్చినట్టే.