Site icon HashtagU Telugu

Actor Politician: నటుడిగా మారిన తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్.. ఈ కర్ణాటక సింగం నెక్స్ట్ స్టెప్ ఏమిటి?

Annamalai

Annamalai

ఎంతోమంది సినీ నటులు రాజకీయ నాయకులు అయ్యారు. కొందరు రాజకీయ నాయకులు సినిమాల్లోనూ నటించారు. ఇప్పుడు అదే కోవలోకి చేరారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. కర్ణాటక సింగంగా పేరు గడించిన ఆయన.. ఓ చిత్రంలో నటించారు. దాని పేరు అరబ్బి. వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో స్విమ్మింగ్ కోచ్ పాత్రలో అన్నామలై కనిపిస్తారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది.

అన్నామలై కుప్పుస్వామికి కర్ణాటక సింగం అని పేరు. ఎందుకంటే ఆయన 2011 ఐపీఎస్ బ్యాచ్ బెంగళూరు క్యాడర్ కు చెందిన వారు. కొన్నాళ్లపాటు చిక్ మంగళూరు, ఉడిపి జిల్లాలకు ఆయన పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేశారు. తరువాత బెంగళూరు సౌత్ కు డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా కూడా ఆయన సేవలు అందించారు. డ్యూటీ విషయంలో నిక్కచ్చిగా ఉండే ఆయనకు ఆ సమయంలోనే కర్ణాటక సింగం అని పేరు వచ్చింది. తరువాత 2019లో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఆగస్టు 25, 2020లో అన్నామలై బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడే ఆయనను రాష్ట్ర పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా చేసింది అధిష్టానం. పార్టీలో చేరిన ఏడాదిలోపే ఆయన రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. తరువాత అరవకురిచి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసినా.. దాదాపు 24 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి స్టాలిన్ ప్రభుత్వ వైఫల్యాలను చూపిస్తూ.. ఆయనను ఇరకాటంలోకి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అన్నామలై.. తరువాత ఐఐఎం లక్నో నుంచి ఎంబీఏ కూడా చేశారు. ఇప్పుడు నటుడిగా మారారు.