Site icon HashtagU Telugu

Hijab Row: హిజాబ్ ధరించిన ముగ్గురు స్టూడెంట్స్‌కు .. ప్రాక్టికల్స్‌కు అనుమ‌తి ఇవ్వ‌ని కాలేజ్

Hijab Row

Hijab Row

హిజాబ్ వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకచోట ఈ వివాదంతో శాంతిభద్రతలకు అఘాతం కలుగుతూనే ఉంది. ఇక తాజా మ్యాట‌ర్ ఏంటంటే క‌ర్నాట‌క‌లో పీయూసీ-II ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఉడిపీలోని ప్రీ యూనివ‌ర్సిటీ మ‌హిళా క‌ళ‌శాల‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులు హిజాబ్ ధ‌రించి రావ‌డంతో వారిని సైన్స్ ప్రాక్టిక‌ల్ పరీక్ష‌కు అనుమతించ‌లేదు.

ఇటీవ‌ల కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉటంకిస్తూ ఆ కాలేజీ ప్రిన్సిపాల్, హిజాబ్ ధ‌రించి వ‌చ్చిన విద్యార్ధినుల‌ ప్రవేశాన్ని నిరాకరించారు. ఇక క్లాసు లోప‌ల హిజాబ్ ధ‌రించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ ఇటీవ‌ల హైకోర్టును ఆశ్ర‌యించిన విద్యార్థినుల్లో ఈ ముగ్గురు బాలిక‌లు కూడా ఉన్నారు. గత వారం హైకోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు పరీక్షను వాయిదా వేయాలని , అభ్యర్థిస్తూ కొంద‌రు విద్యార్థినులు ప్రీ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆశ్రయించ‌గా, వారి అభ్యర్థనను తిరస్కరించడంతో సోమవారం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగాయి.

ఇక‌పోతే ఈరోజు విద్యార్ధులకు చివ‌రి ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష అని, దీంతో రికార్డ్స్ కంప్లీట్ చేసి, ప్రాక్టిక‌ల్స్‌కు హాజ‌ర‌య్యేందుకు క‌ళాశాల‌కు చేరుకోగా, పోలీసుల‌కు ఫోన్ చేస్తాన‌ని ప్రిన్సిప‌ల్ బెదిరించార‌ని దీంతో తాము తిరిగి ఇంటికి వెళ్ళిపోయామ‌ని విద్యార్ధినులు తెలిపారు. ఇక మ‌రోవైపు హిజాబ్‌ను తొలగించి పరీక్షకు హాజరుకావాలని ప్రిన్సిపల్‌ విద్యార్థులను ఒప్పించేందుకు ప్రయత్నించారని, అయితే అందుకు విద్యార్ధినులు అంగీకరించలేదని కళాశాల వర్గాలు తెలిపాయి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, పాటించాల్సిందే అని కాళాశాల ప్రిన్సిప‌ల్ విద్యార్థినుల‌కు ప్రిన్సిప‌ల్ స్ప‌ష్టం చేసి చెప్ప‌గా, అందుకు ఒప్పుకోని బాలిక‌లు ఇంటికి తిరిగి వెళ్ళేందుకు మొగ్గు చూపార‌ని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి.