Karnataka Elections: 38 ఏళ్ళ రికార్డును కాషాయ పార్టీ బద్దలు కొడుతుందా ?

Karnataka Elections: కన్నడ రాజకీయం ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్‌. అక్కడ ఏ పార్టీ ప్రభుత్వం ఎన్నేళ్లుంటుందో చెప్పలేని పరిస్థితి. ఏ ముఖ్యమంత్రీ వరుసగా రెండోసారి పదవి నిలబెట్టుకున్న రికార్డ్ లేదు.

  • Written By:
  • Publish Date - April 12, 2023 / 11:09 PM IST

Karnataka Elections: కన్నడ రాజకీయం ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్‌. అక్కడ ఏ పార్టీ ప్రభుత్వం ఎన్నేళ్లుంటుందో చెప్పలేని పరిస్థితి. ఏ ముఖ్యమంత్రీ వరుసగా రెండోసారి పదవి నిలబెట్టుకున్న రికార్డ్ లేదు. ఈ సంప్రదాయాన్ని బీజేపీ బ్రేక్ చేస్తుందా..? అభివృద్ధి మంత్రి.. డబుల్ ఇంజిన్ హామీ వర్కవుట్ అవుతుందా..ఇప్పుడు ఇదే కన్నడ నాట హాట్ టాపిక్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు గడువుంది.

అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపు కోసం వ్యూహాలు అమలుచేస్తున్నాయి. అయితే కన్నడ రాష్ట్రంలో 1985 నుంచి అధికార పార్టీ వరుసగా రెండోసారి నెగ్గిన దాఖలాలు లేవు. 38 ఏళ్ల ఈ సంప్రదాయాన్ని బద్దలుకొట్టాలని కృతనిశ్చయంతో ఉంది బీజేపీ.
కమలదళం పూర్తి మెజార్టీ సాధిస్తే రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నట్లే. కర్ణాటకలో జనతా పార్టీ నేత రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా 1983 నుంచి 1985 వరకూ మైనార్టీ ప్రభుత్వం కొనసాగింది. రాష్ట్రంలో అదే తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం. 1985లో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనతాపార్టీ.
ఆ తర్వాత పార్టీలో విభేదాలు రావడం.. మూడుగా చీలిపోవడం జరిగిపోయాయి. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ రూల్‌ వచ్చింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతూ వచ్చింది. 1989 నుంచి ఇప్పటివరకూ కర్ణాటకలో ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రులకు మళ్లీ వరుసగా రెండోసారి ఆ పదవి దక్కలేదు.

2008 అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లు గెలుచుకుని.. స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది బీజేపీ. యడియూరప్ప రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చింది బీజేపీ. ఈ ఎఫెక్ట్‌తో 2013లో ఓటమిపాలైంది. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ దక్కడంతో.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 100 సీట్ల మార్కు దాటినా… సంపూర్ణ మెజార్టీకి అడుగు దూరంలోనే ఆగిపోయింది. దీంతో తొలుత కాంగ్రెస్ జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్ ఏర్పాటుచేశాయి. ఆ తర్వాత ఏడాదిన్నరకు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. యడియూరప్ప రాజీనామాతో 2021 జూలైలో బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కాషాయదళం. ఈసారి పూర్తి మెజార్టీ దక్కించుకుకోవడమే టార్గెట్‌గా నేరుగా రంగంలోకి దిగారు మోదీ-షా. కులాలు లెక్కలు, ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేసుకుంటూ వ్యూహాలు అమలుచేస్తున్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ.. డబుల్ ఇంజిన్ హామీతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బొమ్మై సర్కార్‌పై స్థానికంగా వ్యతిరేకత ఉంది. మోదీ చరిష్మా దీనిని అధిగమించాలని భావిస్తోంది కమలదళం. అందుకే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ. ఈ ఏడాదిలోనే 8సార్లు రాష్ట్రానికి వచ్చారు. మరి కర్ణాటకలో బీజేపీ రెండో గండం గట్టెక్కుతుందా..? ట్రెండ్ సెట్ చేస్తుందా లేక ఫాలో అవుతుందా తెలియాలంటే మే 13 వరకు ఆగాల్సిందే.