Squirrel Attack: యూనివర్సిటీ మొత్తాన్ని పరుగెత్తించిన ఉడుత..

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీలో ఓ ఉడుత బీభత్సం సృష్టిస్తోంది. నెల రోజులుగా క్యాంపస్‌లోని విద్యార్థులు, సిబ్బందిపై వరుసగా దాడులు చేస్తూ 20 మందికి పైగా గాయపరిచింది. దీంతో యూనివర్సిటీలో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థులు క్యాంపస్‌లో తిరగాలంటేనే జంకుతున్నారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్, ముఖ్యంగా సైకాలజీ, ఉమెన్స్ స్టడీస్ విభాగాల సమీపంలో ఈ దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 22న ఇద్దరు రీసెర్చ్ స్కాలర్లపై కూడా ఈ ఉడుత దాడి చేయడంతో పరిస్థితి […]

Published By: HashtagU Telugu Desk
Squirrel attack Udaipur University

Squirrel attack Udaipur University

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీలో ఓ ఉడుత బీభత్సం సృష్టిస్తోంది. నెల రోజులుగా క్యాంపస్‌లోని విద్యార్థులు, సిబ్బందిపై వరుసగా దాడులు చేస్తూ 20 మందికి పైగా గాయపరిచింది. దీంతో యూనివర్సిటీలో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థులు క్యాంపస్‌లో తిరగాలంటేనే జంకుతున్నారు.

యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్, ముఖ్యంగా సైకాలజీ, ఉమెన్స్ స్టడీస్ విభాగాల సమీపంలో ఈ దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 22న ఇద్దరు రీసెర్చ్ స్కాలర్లపై కూడా ఈ ఉడుత దాడి చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. కర్టెన్ల వెనుక దాక్కొని, అకస్మాత్తుగా మీదకు దూకి దాడి చేస్తుండటంతో దీని బారి నుంచి తప్పించుకోవడం కష్టంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉడుత భయంతో కొందరు విద్యార్థులు క్యాంపస్‌కు రావడం కూడా మానేశారు.

ఈ విషయంపై ఆర్ట్స్ కాలేజీ అసోసియేట్ డీన్ నవీన్ నంద్వానా మాట్లాడుతూ.. ఉడుతను సురక్షితంగా పట్టుకునేందుకు యానిమల్ ఎయిడ్ బృందం ప్రయత్నించి విఫలమైందని తెలిపారు. దీంతో ఇప్పుడు వన్యప్రాణి నిపుణుల సహాయం తీసుకోవాలని నిర్ణయించామని, వారి ఆధ్వర్యంలో ఉడుతను పట్టుకుని సురక్షితమైన అటవీ ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

ఎండల ప్రభావమే కారణమా?

ఉడుత అసాధారణ ప్రవర్తనకు వాతావరణంలో పెరుగుతున్న తీవ్రమైన ఎండలే కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల చిన్న జంతువుల్లో ఒత్తిడి పెరిగి, దిక్కుతోచని స్థితిలో దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు. దీర్ఘకాలిక ఆకలి కూడా దీనికి మరో కారణం కావచ్చని భావిస్తున్నారు.

ముందుజాగ్రత్త చర్యగా, ఉడుత దాడిలో గాయపడిన వారందరికీ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టెటనస్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. త్వరలోనే ఈ సమస్యను అదుపులోకి తెచ్చి, క్యాంపస్‌లో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు.

  Last Updated: 02 May 2026, 10:38 AM IST