IAS vs IPS: ఇద్దరి అధికారిణుల జగడాని సినిమాగా రూపొందేందుకు ప్లాన్ చేస్తున్న నిర్మాతలు.

కర్ణాటకలో (Karnataka) ఇటీవల ఇద్దరు అగ్రశ్రేణి మహిళా అధికారుల గొడవ మధ్య గొడవ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా,మీడియా వేదికగా కర్ణాటక కేడర్ కు చెందిన సీనియర్ IPS అధికారిణి రూపా మౌద్గిల్ (Roopa Moudgil), సీనియర్ IAS అధికారిణి రోహిణి సింధూరి (Rohini Sindhuri) మధ్య మాటలు, ఆరోపణల యుద్దం కొనసాగిన విషయం తెలిసిందే. అయితే రూపా, రోహిణి సింధూరి మధ్య జరిగిన బహిరంగ సంఘర్షణను ఇప్పుడు వెండితెరపై తీసుకురావడానికి సినీ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) కి..”రోహిణి IAS, R vs R” అనే రెండు సినిమా టైటిల్స్ వచ్చాయి. KFCC కమిటీ వచ్చే వారం సమావేశమై సారాంశాలను చూసి, విన్న తర్వాత ఆ టైటిల్స్ కి ఆమోదం తెలపనుంది. ‘5 అడు 7 అంగులా సినిమా దర్శకుడు నందలికే నిత్యానంద ప్రభు.. R vs R ఆర్ టైటిల్ కోసం దరఖాస్తు చేయగా, కన్నడ రక్షణ వేదికకు చెందిన ప్రవీణ్ శెట్టి రోహిణి IAS టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

KFCC ప్రెసిడెంట్ బామ హరీష్ మాట్లాడుతూ.. తాము Synopses (సినిమా కథ సారాంశం) వింటామని మరియు కథ బయోపిక్ లేదా ఒక వ్యక్తికి సంబంధించినది అయితే, టైటిల్‌లను ఆమోదించే ముందు సంబంధిత వ్యక్తుల నుండి నో – అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి వివాదాలు, ఆసక్తికర సంఘటనలు జరిగినప్పుడల్లా వాటిపైనే నిర్మాతలు, దర్శకులు సినిమాలు తీస్తున్నారని హరీష్ అన్నారు. అయితే రోహిణి సింధూరిపై సినిమా తీయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి కాదు.

రెండు సంవత్సరాల క్రితం మాండ్యకు చెందిన నల్వాడి కృష్ణరాజ వడయార్ ఫిల్మ్స్…రోహిణి సింధూరి వర్కింగ్ స్టైల్ ని ఆధారం చేసుకొని భరత సింధూరి అనే సినిమా రూపొందించడానికి ప్రక్రియను ప్రారంభించింది, అయితే ఈ ప్రాజెక్ట్ పెద్దగా ముందుకు సాగలేదు దీనికి ముందు, IAS జంట షాలిని మరియు రజనీష్ జీవితంపై కూడా ఒక చిత్రం షాలిని IAS ప్లాన్ చేయబడింది, కానీ అది కూడా థియేటర్లోకి అడుగుపెట్టలేదు.

అసలేం జరిగింది?

కర్ణాటకలో ఎమ్మెల్యే సా.రా. మహేష్ భూ కబ్జాకు పాల్పడ్డారని ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి కొద్ది నెలల క్రితం ఆరోపించారు. దీనికి ఎమ్మెల్యే మహేష్ కూడా స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య అప్పట్లో జరిగిన గొడవ యావత్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొద్ది రోజులుగా చల్లారిపోయిన ఈ కేసు ఇప్పుడు కొత్త రూపం దాల్చింది. తాజాగా రోహిణి సింధూరికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి డి.రూప.. ఇలాంటి చిత్రాలు మామూలుగా అనిపించవచ్చు. కానీ, ఒక మహిళా ఐఏఎస్ అధికారి ముగ్గురు మగ ఐఏఎస్ ఆఫీసర్లకు ఒకరి నుంచి ఒకరికి ఇలా ఎన్నో ఫోటోలు తరచూ షేర్ చేస్తుంటే అర్థం ఏమిటి? ఇది ఆమె ప్రైవేట్ విషయం కాదు, ఐఏఎస్ సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం నేరం.

ఏ దర్యాప్తు సంస్థ అయినా ఈ ఫోటోల వాస్తవికతను కూడా విచారణ చేయవచ్చు. కొందరికి ఇది మామూలుగా అనిపించవచ్చు. పంపిన సందర్భం మరోలా ఉంది”అని తన పోస్ట్‌లో డి.రూప తెలిపారు. ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ఎమ్మెల్యే సా.రా. మహేష్ ని కలవడానికి ఎందుకు వెళ్ళింది? అని రూప ప్రశ్నించింది. మైసూరులో సా.రా. మహేష్ భూఆక్రమణకు పాల్పడినట్లు స్వయంగా ఆయనపై ఆరోపణలు చేసిన రోహిణి సింధూరి ఇప్పుడు ఆయనను ఎందుకు కలిశారని ప్రశ్నించారు. అలాంటి నాయకుడిని రోహిణి సింధూరి తోటి ఐఏఎస్ అధికారి మణిమన్నన్ తో వెళ్లి కలిశారని, దీనికి గల కారణాలను వెల్లడించాలని డీ రూప డిమాండ్ చేశారు.

ఆ ఎమ్మెల్యేతో ఒక రెస్టారెంట్ లో రోహిణి సింధూరి చర్చలు జరుపుతున్నట్టుగా ఉన్న ఒక ఫొటోను ఐపీఎస్ అధికారిణి రూప సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎమ్మెల్యే లేదా రాజకీయ నాయకులను ఐఎఎస్ స్థాయి అధికారి కలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. డీకే రవి, రోహిణి సింధూరి చాటింగ్ ల గురించి కూడా రూపా ప్రస్తావించింది. ఐఏఎస్ సింధూరిపై, ఐపీఎస్ డి.రూప 20 ఆరోపణలు చేసింది. రోహిణి సింధూరి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. రోహిణి సింధూరి అక్రమాలకు పాల్పండిందని,రోహిణిపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఫేస్ బుక్ లో తెలిపారు. బీజేపీకి చెందిన మైసూరు లోక్ సభ సభ్యుడు ప్రతాప సింహాపైనా రోహిణి సింధూరి గతంలో పలు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.

బెంగళూరు జాలహళ్లిలో విశాలమైన ఇంటిని రోహిణి సింధూరి కట్టుకున్నారని, స్థిరాస్తి రిటర్న్స్‌లో ఈ ఇంటి ప్రస్తావన లేదని గుర్తు చేశారు. కోట్ల విలువ రూపాయల విలువ చేసే ఇటాలియన్ ఫర్నీచర్, 26 లక్షల రూపాయల విలువ చేసే జర్మన్ ఇంటీరియర్స్ ను దీనికి వినియోగించారని అన్నారు. వీటన్నింటికీ డబ్బలు ఎక్కడివని ప్రశ్నించారు. కొవిడ్‌తో దేశమంతటా జనం తల్లడిల్లుతుంటే మైసూరు కలెక్టర్ గా ఉన్న రోహిణి సింధూరి ఆ సమయంలో కలెక్టరేట్ లో విలాసవంతమైన స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి అని విమర్శించారు.

పీఎస్‌ రూపా ముద్గల్ తన ప్రైవేటు పోటోలు విడుదల చేయడం పై ఐఏస్‌ రోహిణి సింధూరి మండిపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రూపా ముద్గల్‌ మతి స్థిమితం కోల్పోయిందని రోహిణి మండిపడ్డారు. రూపా ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతో ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలని సెటైర్‌ వేశారు రోహిణి. తన వ్యక్తిగత ఫొటోలను తాను ఏ అధికారులకు పంపించానో రూప బయటపెట్టాలని సవాల్ చేశారు.

తన వాట్సాప్ స్టేటస్ నుంచి, తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫొటోలను సేకరించి, వాటిని తాను ఇతర ఐఏఎస్ లకు పంపించినట్టు రూప తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇద్దరూ మహిళా సివిల్‌ సర్వీస్‌ అధికారులు సోషల్‌మీడియా వేదికగా రచ్చ రచ్చ చేసుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రోహిణి సింధూరి, రూపా మౌద్గల్‌ పరస్పర ఆరోపణల తీరుపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మండిపడ్డారు. ఈ మేరకు ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేయాలని చీఫ్‌ సెక్రటరీని ఆదేశించారు. అందుకు అనుగుణంగానే సోమవారం మధ్యాహ్నం ఐఏఎస్‌ రోహిణి సింధూరి,రూప విధానసౌధలో చీఫ్‌ సెక్రటరీ వందితాశర్మను భేటీ అయ్యారు.

ఇద్దరు అధికారులు సోషల్‌ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలపై కళ్లు మూసుకోలేదని, తీవ్రంగా పరిగణించామని హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు. సోమవారం అధికారిక నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇద్దరి తీరు సమంజసంగా లేదన్నారు. ప్రజాసేవ చేయాల్సిన వారు ఇలాంటి ఆరోపణలతో ఐఏఎస్‌, ఐపీఎస్‌ కేడర్లకు అవమానం చేస్తున్నారన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇద్దరిపైనా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందేనని మాజీ సీఎం కుమారస్వామి డిమాండ్‌ చేశారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ అధికారులు ఇలా వ్యవహరిస్తే ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వస్తుందన్నారు.

డీకే రవి మృతిపై CBI నివేదిక తెరపైకి:

దివంగత డీకే రవి మృతిపై సీబీఐ నివేదిక మళ్లీ తెరపైకి వచ్చింది. డి. డీకే రవి మృతిపై సీబీఐ నివేదికను రూప తన ఆరోపణల్లో ప్రస్తావించారు. డీకే రవి తనను మెసేజ్ ల రూపంలో ఇబ్బంది పెట్టేవాడని సింధూరి చెబుతుంటదని,డీకే రవి ఇబ్బంది పెడితే నంబర్‌ను ఎందుకు బ్లాక్ చేయలేదని డి.రూపా ప్రశ్నించారు. అయితే ఇద్దరు అధికారులు వాగ్వాదాలు చేసుకుంటూ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందిన తన కుమారుడు డీకే రవి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదని ఆయన తల్లి గౌరమ్మ పేర్కొన్నారు. చెన్నపట్టణ తాలూకా కదరమంగల గ్రామంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.. తన కుమారుడి చావుకు రోహిణి సింధూరి బాధ్యురాలు కాదన్నారు. వారు స్నేహితులని, చదువుకునే రోజులనుంచి మిత్రులుగా ఉండేవారన్నారు. తమ ఇంటికి సింధూరి మూడుసార్లు వచ్చారని పేర్కొన్నారు. ఇద్దరికీ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుని ఉండేవారని, తమకు వ్యతిరేకత లేదన్నారు. జరిగిన విషయంలో తన కుమారుడి పేరు ప్రస్తావించవద్దన్నారు.

Also Read:  Nokia: 60 ఏళ్లలో తొలిసారి నోకియా తన లోగో మార్చుకుంది.