Site icon HashtagU Telugu

Shashikala: ‘ఆమె’ను అన్నాడీఎంకే లోకి ఆహ్వానించండి!

Sasikala Cries1

Sasikala Cries1

అన్నాడీఎంకే లోకి వి.కె. శశిక‌ళ‌ను తిరిగి తీసుకోవాల‌ని థేని జిల్లా కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం  జ‌రిగింది. ఆమె మేనల్లుడు T.T.V దినకరన్, అతని పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK)ని కూడా ఈ విష‌యాన్ని ప్రస్తావించారు. అన్నాడీఎంకే చీఫ్ కోఆర్డినేటర్, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం ఫామ్‌హౌస్‌లో బుధవారం జరిగిన ఈ సమావేశానికి ఆ పార్టీ తేని జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాన్ అధ్యక్షత వహించారు. వీరిద్దరిని తిరిగి చేర్చుకోవడంపై జిల్లా కమిటీ నేతలు మాట్లాడినప్పుడు, పార్టీ హైకమాండ్‌కు వెళ్లేందుకు వీలుగా దీనిపై తీర్మానం చేయాలని పన్నీర్‌సెల్వం కోరినట్లు సమావేశానికి హాజరైన పార్టీ వర్గాలు తెలిపాయి. శశికళ‌, పన్నీర్‌సెల్వం ఇద్దరూ ఉన్న శక్తివంతమైన తేవర్ సామాజికవర్గం శశికళను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని అన్నాడీఎంకే నాయకత్వంపై ఒత్తిడి తెస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే తమిళనాడులోని మరికొన్ని జిల్లాలు కూడా శశికళ రాజకీయ ప్రవేశం కోసం ఒత్తిడి తెస్తున్నాయి.

దక్షిణ తమిళనాడులో గణనీయమైన ఓటు బ్యాంకుతో, తేవర్ కమ్యూనిటీ ఎప్పుడూ అన్నాడీఎంకేకు బలమైన పునాదిగా ఉంది. ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో, పన్నీర్‌సెల్వం ఉన్న వార్డులో కూడా పార్టీ అభ్యర్థులు ఓడిపోవడంతో దక్షిణాది బెల్ట్ లో అన్నాడీఎంకే భారీగా ఓడిపోయింది. పార్టీ తేని జిల్లా కార్యదర్శి సయ్యద్‌ఖాన్ మాట్లాడుతూ.. ఏఐఏడీఎంకే ఎప్పుడూ ప్రజల కోసం పోరాడే రాజకీయ పార్టీ అని, దివంగత నేతలు ఎంజీఆర్‌, జే.జయలలిత వారసత్వాన్ని మళ్లీ పార్టీలోకి తీసుకుని ముందుకు సాగాలన్నారు.  ఈ ప్రక్రియలో భాగంగా పార్టీ నుండి బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ తిరిగి రావాలని మేము కోరుకుంటున్నామని ఆయ‌న తెలిపారు. ఎన్నికల పరాజయానికి అనేక ఇతర అంశాలు ఉన్నాయని.. అయితే ఈ నాయకుల కలయిక పార్టీకి అవసరమైన మద్దతును మరియు పుష్టిని ఇస్తుంద‌ని తెలిపారు.  పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సమక్షంలో శశికళను తిరిగి చేర్చుకునే తీర్మానాన్ని ఆమోదించడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆస‌క్తి రేగింది. తేవర్ సంఘం చేసిన ఒత్తిడి ఈ తీర్మానానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఆమె ఎఐఎడిఎంకె రోజువారీ వ్యవహారాల్లోకి తిరిగి రావడానికి సమయం ఆసన్నమైన్నట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

Exit mobile version