MK Stalin : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను క్రమంగా కేంద్రీకరించే ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం, సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచే దిశగా అడుగులు వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జరిగిన ప్రసంగంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ..రాష్ట్రాలకు సముచితంగా దక్కాల్సిన నిధులను కేంద్రం వినకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన స్థితి ఏర్పడింది. ఇది భారతదేశ సమాఖ్య పద్ధతికి మచ్చుతునక అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: KTR : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది కాంగ్రెస్ పాలన : కేటీఆర్
కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, మిగిలిన రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్న కేంద్ర వైఖరిని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రం తనకు తాను గుర్తింపుతో ఉండాలి. ఒక్కొక్క రాష్ట్ర అభివృద్ధే దేశ పురోగతికి పునాది. కేంద్రం ఈ విషయాన్ని గుర్తించకపోతే, మనదేశ కీర్తి ప్రపంచంలో వెలుగు చూడదు అని హెచ్చరించారు. ఇకపోతే, గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆధ్వర్యంలో నిర్వహించే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సీఎం స్టాలిన్ హాజరు కాకపోవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో గవర్నర్‌తో జరిగిన విభేదాల నేపథ్యంలో ఈ అభిప్రాయ భేదం మరింత ముదిరిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గవర్నర్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కొనియాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ, ముఖ్యమంత్రి స్టాలిన్‌ను గానీ ప్రస్తావించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోందని గవర్నర్ వ్యాఖ్యానించారు. పేదలపై వివక్ష, మాదకద్రవ్యాల విస్తరణ, మహిళలు మరియు చిన్నారులపై లైంగిక దాడుల పెరుగుదల వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై పరోక్ష విమర్శలుగా అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం–కేంద్ర సంబంధాలు మరింత ఉద్రిక్తత వైపు సాగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సమాఖ్య వ్యవస్థ బలపడాలంటే, కేంద్రం పక్షపాత ధోరణిని విస్మరించి అన్ని రాష్ట్రాలకు సమానంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్టాలిన్ మరోసారి గుర్తు చేశారు.
Read Also: War 2 Review: ఆకట్టుకునే బ్రోమాన్స్ యాక్షన్ వార్