CM Stalin: వాట్ ఏ ప్లాన్ స్టాలిన్! చెత్తతో కూడా కోట్లు సంపాదించే ప్లాన్ వేశావుగా!

  • Written By:
  • Updated On - March 13, 2022 / 07:41 PM IST

ఏంట్రా బాబూ ఈ చెత్త.. ఇంట్లో చెత్త, వీధిలో చెత్త, ఊర్లో చెత్త, ఎక్కడ చూసినా చెత్త చెత్త చెత్త. ఇంత చెత్తను ఏం చేయాలో తెలియక కార్పొరేషన్లు, ప్రభుత్వాలు తలకిందులవుతాయి. అందుకే తమిళనాడు ప్రభుత్వం దీనికి మంచి ఆలోచన చేసింది. అదే బయో సీఎన్జీ. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో దీనిని తయారుచేయనుంది. పైగా దీనివల్ల వచ్చే గ్యాస్ ను.. ఇప్పుడున్న ధరకంటే చవకగా ఇవ్వచ్చు కూడా.

చెన్నైలో 5 చోట్ల 7 ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది తమిళనాడు ప్రభుత్వం. పూర్తిగా తడిచెత్తతోనే ఈ గ్యాస్ ని తయారుచేయనుంది. చాలామంది ఇళ్లలోనే కుళ్లిన చెత్త నుంచి బయో గ్యాస్ ను తయారుచేసుకుంటూ ఉంటారు. కానీ బయో సీఎన్జీ మాత్రం దానికన్నా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే బయో గ్యాస్ తో పోలిస్తే.. బయో సీఎన్జీ నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వంట చేసుకోవడానికి ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు హోటళ్లు వాహనాలు, ఇండస్ట్రీలకు కూడా వాడుకోవచ్చు.

ఒక్కో ప్లాంట్ కు 10 కోట్లను కేటాయించారు. అంటే మొత్తం ఇది 70 కోట్ల ప్రాజెక్టు అన్నమాట. ఒక్కో ప్లాంట్ నుంచి రోజూ 100 టన్నుల గ్యాస్ ను ఉత్పత్తి చేయడమే లక్ష్యం. అంటే మొత్తం రోజుకు 7 ప్లాంట్ల నుంచి 700 టన్నుల గ్యాస్ వస్తుంది. ఇది పూర్తిగా పీపీపీ విధానంలోనే ఉంటుంది. అంటే వీటిని నిర్మించినవారే.. 20 ఏళ్లపాటు నిర్వహణను చూసుకుంటారు. తరువాత ప్రభుత్వానికి అప్పగిస్తారు.

చెన్నై సిటీలో వచ్చే చెత్త తక్కువేమీ కాదు. ఎలా లేదన్నా రోజుకు 5,500 టన్నులు వస్తుంది. ఇందులో దాదాపుగా 50 శాతం తడిచెత్తే. ఇప్పటివరకు ఇలాంటి చెత్తను భూమిలో పాతడం, ఎరువుల కోసం వినియోగించడం జరిగింది. కానీ ఇప్పుడు దాని రూటు, ఫేటు మారింది. దీని ద్వారా తయారుచేసే బయో సీఎన్జీని ఇళ్లు, వాహనాల గ్యాస్ అవసరాల కోసం వినియోగిస్తారు. ఆయిల్ కార్పొరేషన్లకూ ఇస్తారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఇలాంటి ప్లాంట్ నే ఈమధ్య ఏర్పాటు చేశారు. అక్కడ రోజూ 17 వేల కేజీల గ్యా్స్ ను తయారుచేస్తారు. ఇప్పుడీ చెన్నై ప్రాజెక్ట్ కాని సక్సెస్ అయితే.. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటుచేయచ్చు. దీనివల్ల చెత్త సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. అలాగే చాలామందికి ఉపాధి దొరుకుతుంది. సామాన్యులకు వంట గ్యాస్ చవకగా దొరుకుతుంది. పర్యావరణానికి మేలు చేకూరుతుంది