తమిళనాడు సీఎం స్టాలిన్ ఏం చేసినా అది వైవిధ్యంగానే ఉంటుంది. ఆయన నిర్ణయాల్లో పారదర్శకత కనిపిస్తుందంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు ఓ దళిత యువతి గ్యాంగ్ రేప్ కేసులోనూ ఆయన వేగమైన చర్యలు తీసుకున్నారు. తమిళనాడులోని విరుధ్ నగర్ లోని మేల్ వీధికి చెందిన హరిహరన్.. ఓ దళిత యువతిని ప్రేమ పేరుతో మోసగించాడు. పెళ్లి పేరు చెప్పి నమ్మించి కామవాంఛ తీర్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ ఘటనను వీడియో తీసి.. ఫ్రెండ్స్ కు పంపించడంతో అసలు కథ మొదలైంది.
హరిహరన్ పంపించిన వీడియోను చూసిన అతడి 8 మంది స్నేహితులు… ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని కొన్ని నెలలపాటు కొనసాగించారు. ఈ నిందితుల్లో నలుగురు మైనర్లే కావడం విస్మయానికి గురిచేసే అంశం. పదే పదే తనను ఈ విధంగా హింసించడంతో మానసికంగా తీవ్ర భయాందోళనలకు గురైన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విరుధ్ నగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి.. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన కాస్తా తమిళనాట సంచలనమైంది. రాజకీయపార్టీలకు అస్త్రంగా మారింది. దీంతో తమిళనాడు సీఎం స్టాలిన్ ఏకంగా అసెంబ్లీ వేదికగా ఓ ప్రకటన చేశారు. విరుధ్ నగర్ ఘటనకు కారణమైన నిందితుల్లో నలుగురిని 24 గంటల్లోనే పట్టుకున్నామని చెప్పారు. కేసును సీబీసీఐడీకి బదిలీ చేశామన్నారు. సీబీసీఐడీ సూపరింటెండెంట్ ముథరాసిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటుచేశారు. కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని డీజీపీకి కూడా సూచించారు. ఎవరైనా ఇలాంటి నేరాలు చేస్తే.. వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడానికి ఇదే ఓ ఉదాహరణ అని చెప్పారు స్టాలిన్.