Site icon HashtagU Telugu

Tamilnadu BJP Chief Annamalai : రాత్రి వేళ బీజేపీ నేతలు ఒంటరిగా తిరగొద్దు.. తమిళనాడు బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Tamilnadu Bjp Chief Annamalai

Tamilnadu Bjp Chief Annamalai

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయినా సరే.. ఆ పార్టీ నేతలు రాష్ట్రాల్లో ఒంటరిగా తిరగడానికి భయపడుతున్నారా? తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వ్యాఖ్యలు చూస్తే.. అలానే అనిపిస్తుంది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని.. అందుకే బీజేపీ నేతలు కాని, హిందూ సంస్థల నేతలు కాని అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రివేళల్లో ఒంటరిగా తిరగకూడదని చెప్పారు.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. దేశంలో ఓ సంస్థ వల్లే ఇన్ని దురాగతాలు జరుగుతున్నాయన్నారు. ఈమేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించిందన్నారు. అందుకే ఆ సంస్థను నిషేధించాలని కేంద్రం ఆలోచిస్తోందన్నారు. ఆ సంస్థే.. భారతీయ జనతాపార్టీ నాయకులతోపాటు హిందూ సంస్థల నేతలను టార్గెట్ గా పెట్టుకుని దాడులకు పాల్పడవచ్చని హెచ్చరికలు ఉన్నాయన్నారు.

రాష్ట్ర బీజేపీ నేతలు కాని, కార్యకర్తలు కాని, హిందూ సంస్థల నేతలు కాని ఎవరూ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని అన్నామలై సూచించారు. రాత్రి వేళ ఎవరూ ఒంటరిగా రావద్దని హెచ్చరించారు. ఇంతకీ వీరిని టార్గెట్ చేసుకున్న ఆ సంస్థ ఏది? కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమని చెప్పింది? కేంద్రం ఎందుకు దానిని నిషేధించాలనుకుంటోంది? ఇప్పుడీ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

తమిళనాడులో బీజేపీకి సొంత బలం తక్కువ. గతంలో అన్నాడీఎంకే హయాంలో దానికి కాస్త పట్టుండేది. కానీ డీఎంకే వచ్చాక.. అక్కడ దానికి పట్టు దొరకడం లేదు. ఈనేపథ్యంలో అన్నామలై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. దీంతో తమిళనాడు బీజేపీ నేతలు తగిన జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు.