Kallattikulam : ఆ ఊరి జనాభా 20 ఏళ్ల క్రితం 200. ప్రస్తుతం ఆ గ్రామంలో కేవలం ఆరుగురు ఉంటున్నారు. వాళ్లంతా మహిళలే!! పురుషులు ఎవరూ ఊరిలో ఉండటం లేదు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కముది తాలూకాలో ఉన్న కల్లత్తికులం గ్రామానికి ఈ భిన్నమైన పరిస్థితి ఎందుకు ఎదురైంది. ఈ ఊరిలోని జనమంతా ఏమయ్యారు ? ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Alimony Deciding Factors : విడాకుల భరణం నిర్ణయించడానికి 8 మార్గదర్శకాలు.. జారీ చేసిన సుప్రీంకోర్టు
అలనాడు వైభవం..
కల్లత్తికులం గ్రామంలో కేవలం ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరిలో ముగ్గురు ఉపాధి హామీ కూలీలు. వీరికి 100 రోజుల ఉపాధిహామీ పనే జీవనాధారం. ఇద్దరు చదువుకునే ఆడపిల్లలు ఉన్నారు. మరో యువతి ఈ గ్రామానికి దత్తతపై వచ్చింది. ఈ ఊరిలో(Kallattikulam) వినాయకుడి ఆలయం, వాళవంద అమ్మవారి కోవెల ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం గ్రామంలో జనాభా పెద్దసంఖ్యలో ఉన్నప్పుడు.. ఇవి నిత్యం పూజలు, అర్చనలు, అభిషేకాలతో కిటకిటలాడేవి. అప్పట్లో ఈ ఊరికి సమీపంలోని ఎలువనూర్, నెడుంగులం, పులియంగులం గ్రామాల్లో ఏ గొడవలు జరిగినా కల్లత్తికులం గ్రామపెద్దలే పరిష్కరించేవారు.
Also Read :Yuvraj Singh Birthday : రికార్డుల రారాజు యువ‘రాజ్’కు హ్యాపీ బర్త్‌డే.. కెరీర్ విశేషాలివీ
అసలు సమస్యేంటి ?
కల్లత్తికులం గ్రామంలో తాగునీటి వసతి అంతగా లేదు. నిత్యావసరాలు, వంట సరకుల కోసం కూడా 2 కి.మీ. దూరంలోని పొరుగూరికి వెళ్లాల్సిందే. దీంతో పిల్లల చదువుల కోసం కొన్ని కుటుంబాలు.. కుటుంబ సభ్యుల ఉపాధి అవకాశాల కోసం ఇంకొన్ని కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ఈ ఊరిలోని పురుషులంతా ఒకరి తర్వాత ఒకరిగా చెన్నై, బెంగళూరు, మధురై, కోయంబత్తూరు వంటి నగరాలకు వెళ్లిపోయారు. తమకు ఉద్యోగ అవకాశాలు లభించిన వెంటనే.. ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి ఊరి నుంచి కుటుంబాలను తీసుకెళ్లిపోయారు. దీంతో కల్లత్తికులం గ్రామంలో ఇప్పుడు పాడుబడిపోయిన మట్టి ఇళ్లు కనిపిస్తున్నాయి. అవన్నీ తాళాలు వేసి కనిపిస్తున్నాయి. ఊరి నుంచి వెళ్లిపోయిన వారిలో కొందరు ఏడాదికోసారి కల్లత్తికులం గ్రామంలో కులదేవత పండుగకు వస్తారు. కొందరు పక్క ఊళ్లలో బంధువుల ఇళ్లకు వచ్చినప్పుడు.. దారిలో తమ గ్రామస్తుల్ని పలకరించి వెళ్తుంటారు.