Site icon HashtagU Telugu

Tamil Nadu: తమిళనాడు సీఎం స్టాలిన్ కు అస్వస్థత.. వైద్యులు ఏం చెప్పారంటే..!

Tamil Nadu CM Stalin

Tamil Nadu CM Stalin

తమిళనాడులో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన శనివారం నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. ముందు లైట్ గానే తీసుకున్నా నీరసంగా ఉండడంతో ఆయనను వైద్యులు పరిశీలించారు. దీంతో రెండు రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఈ విషయాలను నీటి వనరుల శాఖా మంత్రి దురైమురుగన్ తెలిపారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తేలికపాటి జ్వరం కావడంతో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారు. స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. జిల్లాల పర్యటనలు, ఢిల్లీ పర్యటనలతో పాటు సమీక్షా సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో క్షణం తీరికలేకుండా బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నారు. దీంతో ఆయనకు రెస్ట్ అనేదే లేకుండా పోయింది.

ముందుగా ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం.. సోమవారం నాడు స్టాలిన్ మూడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు జిల్లాల్లో స్టాలిన్ పర్యటనపై ముందుగానే సమాచారమిచ్చారు. దీంతో అధికారులు దానికి తగిన ఏర్పాట్లు చేశారు. వారితోపాటు ఆయా జిల్లాల డీఎంకే నేతలు కూడా స్టాలిన్ కు ఘన స్వాగతం పలకడానికి.. ఆయన పాల్గొనే కార్యక్రమాలు అదరగొట్టడానికి భారీగా ప్లాన్ చేశారు. కానీ ఇదే సమయంలో ఆయనకు జ్వరం సోకడంతో కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి స్టాలిన్ జిల్లాల పర్యటన రద్దయిందని.. మళ్లీ ఎప్పుడు ఆయన జిల్లాల్లో పర్యటిస్తారో ఆ షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.