Site icon HashtagU Telugu

Tamil Nadu Local War: డీఎంకే గ్రాండ్ విక్ట‌రీ .. సెన్షేష‌న్ క్రియేట్ చేసిన ట్రాన్స్‌జెండ‌ర్

Tamilnadu Local Body Elections

Tamilnadu Local Body Elections

తమిళనాడు లోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ జోరు కొన‌సాగుతోంది. అలాగే చెన్నై కార్పొరేష‌న్‌లో కూడు డీఎంకే పార్టీ క్లీన్‌స్వీప్ దిశ‌గా దూసుకుపోతుంది. అన్నాడీఎంకే కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ త‌మిళ‌నాడులోనూ డీఎంకే సత్తా చాటుతోంది. ఈ క్ర‌మంలో కోయంబత్తూరులో 75 శాతానికిపైగా స్థానాల్లో డీఎంకే విజ‌యం సొంతం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పోరేష‌న్ల‌లో 1374 వార్డులు ఉండ‌గా, అందులో 425 స్థానాల్ని డీఎంకే ద‌క్కించుకుంది. 75 స్థానాల్లో మాత్ర‌మే అన్నాడీఎంకే గెలుపొందింది.

ఇక మున్సిపాలిటీల్లో మొత్తం 3843 వార్డులకు గాను, 1832 స్థానాల్లో డీఎంకే విజ‌యభేరి మోగించగా, ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే 494 స్థానాల్లో గెలుపొందింది. పంచాయితీల్లో ఉన్న 7621 స్థానాల్లో 4261 చోట్ల డీఎంకే విజ‌యం సాధించ‌గా, అన్నాడీఎంకే 1178 స్థానాల‌కు ప‌రిమితం అయ్యింది. మ‌రోవైపు చెన్నై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 200 వార్డులు ఉండ‌గా, అందులో 192 స్థానాల ఫలితాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో చెన్నై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఉన్న 200 వార్డుల్లో 146చోట్ల డీఎంకే గెలుపొందగా, అన్నాడీఎంకే 15 స్థానాల్లో గెలుపొందింది. 3 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది.

10ఏళ్ల త‌ర్వాత‌ త‌మిళ‌నాడులో లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ ఫిబ్ర‌వ‌రి 19న జ‌రిగ‌గా, నేడు ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈరోజు ఉద‌యం 8గంట‌ల నుండి ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతున్న నేప‌ధ్యంలో, ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఫ‌లితాల‌ను చూస్తే, త‌మిళ‌నాడు లోక‌ల్ వార్‌లో అధికార డీఎంకే పార్టీ భారీగా స్థానాల్ని కైవ‌సం చేసుకునే అవ‌కాశం ఉంది. దీంతో తమిళ‌నాడు సీఎం స్టాలిన్ హ‌ర్హం వ్య‌క్తం చేస్తూ, త‌మిళ్ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో డీఎంకే పార్టీ తొమ్మిది నెల‌ల సుప‌రిపాల‌న‌కు, ప్ర‌జ‌లు ఇచ్చిన స‌ర్టిఫికేట్‌గా స్టాలిన్ పేర్కొన్నారు.

ఇక తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెల్లూరు నుంచి ట్రాన్స్‌జెండర్ గంగా నాయక్ విజయం సాధించడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. గంగా నాయ‌క్ విజ‌యం పై ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. త‌మిళ‌నాడులో జరిగిన ఏదైనా ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించడం ఇదే తొలిసారని స‌మాచారం. ఈ విజేత డీఎంకే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇరవయ్యేళ్ళ నుంచి డీఎంకే మెంబర్‌గా ఉన్న గంగా నాయ‌క్ వెల్లూరు మున్సిపాలిటీ ప‌రిధిలోని 37వ వార్డు నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ సూప‌ర్ విక్ట‌రీ కొట్టారు. మ‌రోవైపు దక్షిణ భారత ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ కార్యదర్శిగానూ, సామాజిక కార్య‌క‌ర్త‌గా గంగా నాయ‌క్ ప‌ని చేస్తున్నారు. ఏది ఏమైనా త‌మిళనాడు లోక‌ల్ వార్‌లో అధికార డీఎంకే పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టడంతో ఆపార్టీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.