Site icon HashtagU Telugu

Hindi Movies Ban : హిందీ మూవీస్ బ్యాన్ కు తమిళనాడు ప్రభుత్వం బిల్లు!

Tamilnadu Cm Stalin

Tamilnadu Cm Stalin

తమిళనాడులో మళ్లీ హిందీ వ్యతిరేక ఉద్యమ జ్వాలలు రగులుతున్నాయి. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా హిందీ సినిమాలు, పాటలు, హోర్డింగ్స్‌పై నిషేధం విధించే బిల్లును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. “తమిళ సంస్కృతి, భాషకు ప్రాధాన్యం ఇవ్వడం మా బాధ్యత. కేంద్రం హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోంది. దానికి తమిళనాడు తలవంచదు” అని సీఎం స్టాలిన్ పలు సమావేశాల్లో స్పష్టంగా ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా డ్రావిడ మోడల్ ప్రభుత్వం తమ భాషా గౌరవాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉందని మరోసారి చూపించింది.

‎Diwali: దీపావళి రోజు వెలిగించే దీపాలకు కూడా ఒక పద్ధతి ఉంటుందని మీకు తెలుసా?

ఇక ఈ నిర్ణయం చట్టపరంగా ఏ స్థాయిలో నిలబడుతుందనే అంశంపై నిన్న రాత్రి సీఎం స్టాలిన్ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం. న్యాయ నిపుణులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో చర్చించి బిల్లుకు తగిన చట్టపరమైన ఆధారాలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. హిందీ వ్యతిరేకంగా తమిళనాడులో ఇది కొత్త విషయం కాదు. 1960ల నుంచే డ్రావిడ ఉద్యమం హిందీని వ్యతిరేకిస్తూ రాష్ట్ర రాజకీయాలపై గాఢమైన ముద్ర వేసింది. స్టాలిన్ తీసుకున్న తాజా నిర్ణయం ఆ చరిత్రను మరలా గుర్తు చేస్తోంది. ఇది కేవలం సినిమా లేదా పాటలపైన నిషేధం కాకుండా, తమిళ గుర్తింపును రక్షించాలనే భావోద్వేగానికి సంకేతమని విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ముఖ్యంగా బీజేపీ నేత వినోజ్ సెల్వమ్, “ఇది పూర్తిగా మూర్ఖత్వం. భారతదేశం బహుభాషా దేశం. హిందీని బ్యాన్ చేయడం ఏకతకు విరుద్ధం” అని మండిపడ్డారు. ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని రాజకీయ లాభాల కోసం ప్రజల మధ్య భాషా విభేదాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. మరోవైపు, డీఎంకే అనుచరులు మాత్రం ఈ నిర్ణయాన్ని భాషా గౌరవ పోరాటంగా సమర్థిస్తున్నారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల మధ్య భాషా ఆధారిత తగాదా మళ్లీ తలెత్తిన ఈ సందర్భం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు నిర్ణయం ఇతర దక్షిణ రాష్ట్రాలకూ ప్రేరణగా మారుతుందా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.

Exit mobile version