Site icon HashtagU Telugu

Tamil Nadu farmers : అభివృద్ధిలో కేసీఆర్ మోడ‌ల్‌ని అమ‌లు చేయాలంటున్న త‌మిళ రైతులు

New Farmer Schemes

Farmers

సంక్షేమం, అభివృద్ధిలో కేసీఆర్ మోడల్‌ను అమలు చేయాలని తమిళనాడు రైతులు డిమాండ్ చేశారు. కేసీఆర్ అమ‌లు చేస్తున్న రైతు సంక్షేమ కార్య‌క్ర‌మాలకు ఆకర్షితులై తమిళనాడులోని రైతు సంఘాలు తమ రాష్ట్రంలో కూడా అలాంటి కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోయంబత్తూరులో శనివారం జరిగిన ‘కేసీఆర్ మోడల్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్’ సమావేశంలో, రైతులు ఎంఎస్‌పి గ్యారెంటీ చట్టంతో పాటు తెలంగాణ మోడల్ పథకాలను పునరావృతం చేయాలని డిమాండ్ చేశారు.

గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన రెండు రోజుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన దక్షిణ భారత రైతు సమాఖ్య ప్రధాన కార్యదర్శి పీకే దైవ సిగమణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్దిలో కేసీఆర్ ఆదర్శంగా నిలుస్తున్నారని, ముఖ్యంగా రైతు సమాజానికి ఎంతో అవసరమన్నారు. తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తమిళనాడులో ఇటువంటి పథకాల ఆవశ్యకతను వివ‌రిస్తూ తమిళనాడులోని ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ లేఖలు రాస్తామని చెప్పారు. ఆ త‌రువాత కన్యాకుమారి నుంచి చెన్నై వరకు రైతులతో పాదయాత్ర సాగుతుందని ఆయన తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా తదితర తెలంగాణ కార్యక్రమాలను సౌత్ ఇండియా ఫార్మర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.నరసింహం నాయుడు ఈ సమావేశంలో రైతులకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎనిమిదేళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు.