Site icon HashtagU Telugu

Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్‌కి వై కేట‌గిరి భ‌ద్ర‌త‌

Annamalai

Annamalai

భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర‌ అధ్యక్షుడు కె. అన్నామలై కి కేంద్ర హోంశాఖ వై కేట‌గిరి భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది. త‌మిళ‌నాడు బీజేపీని బ‌లోపేతం చేసేందుకు అన్నామ‌లై తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు పలు బెదిరింపులు రావ‌డంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వై కేట‌గిరి భ‌ద్రత‌ను క‌ల్పించింది. అన్నామలైకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ‘వై’ భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై మూడు పెట్రోల్ బాంబులు విసిరిన నేపథ్యంలో ఆయ‌న‌కు భ‌ద్ర‌త పెంచాల్సి వ‌చ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెన్నైలోని టి నగర్‌లోని తమిళనాడు బిజెపి ప్రధాన కార్యాలయం ‘కమలాలయం’పై మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. బాంబులు విసిరిన ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ జరిపించాలని అన్నామలై డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన బాంబు దాడికి తమిళనాడు ప్రభుత్వమే కారణమని బీజేపీ నేత కరాటే త్యాగరాజన్ ఆరోపించారు.

గత ఏడాది అన్నామలై తమిళనాడు బీజేపీ యూనిట్ ఉపాధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మతపరమైన తీవ్రవాదుల నుంచి ప్రాణాలకు ముప్పు రావడంతో ఆయనకు ‘వై’ భద్రత కూడా కల్పించడం గమనార్హం. ఈ ఏడాది జరిగిన సివిక్ ఎన్నికల్లో పార్టీని విశ్వసనీయమైన పనితీరుకు తీసుకెళ్లిన తర్వాత ఆయన బీజేపీ అగ్రనేతల ప్రశంసలు కూడా పొందారు. ఫిబ్రవరి 2022లో జరిగిన తమిళనాడు సివిక్ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) విజయం సాధించింది. అయినప్పటికీ, BJP రాష్ట్రంలో తన ఓట్ల వాటాను పెంచుకోగా..చెన్నై కార్పొరేషన్‌లో ముఖ్యమైన స్థానాన్ని కైవసం చేసుకుంది.