Telangana to K Congress : కోవ‌ర్ట్ జాఢ్యం! రేవంత్ సుఫారీలోని నిజ‌మెంత‌?

క‌ర్ణాట‌క కాంగ్రెస్ లోనూ 500కోట్ల‌ కోవ‌ర్ట్ రాజ‌కీయాన్ని (Telangana to K Congress ) తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ‌య‌ట‌పెట్టారు.

  • Written By:
  • Publish Date - January 19, 2023 / 12:30 PM IST

క‌ర్ణాట‌క కాంగ్రెస్ లోనూ కోవ‌ర్ట్ రాజ‌కీయాన్ని (Telangana to K Congress ) తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ‌య‌ట‌పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో క‌లిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌తీయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. నిజంగా కేసీఆర్ క‌ర్ణాట‌క‌లోనూ కోవ‌ర్ట్ రాజ‌కీయం చేస్తున్నారా? రూ. 500కోట్ల‌కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ నేత ఎవ‌రు? గెలిచే కాంగ్రెస్ పార్టీని ఓడించే ద‌మ్ము కేసీఆర్ కు క‌ర్ణాట‌క‌లోనూ ఉందా? రేవంత్ రెడ్డి (Revanth) చెప్పే మాట‌ల్లో నిజ‌మెంత‌? అనేది ఇప్పుడు కర్ణాట‌క కాంగ్రెస్ లో న‌డుస్తోన్న పెద్ద చ‌ర్చ‌.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోవ‌ర్ట్‌ జాఢ్యాన్ని క‌ర్ణాట‌క కాంగ్రెస్ కు (Telangana to K Congress) ..

కోవ‌ర్ట్ రాజకీయం తెలంగాణ కాంగ్రెస్ ను బ‌ల‌హీన‌ప‌రిచింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోవ‌ర్ట్‌ జాఢ్యాన్ని క‌ర్ణాట‌క కాంగ్రెస్ కు (Telangana to K Congress) కూడా అంటించారు. అక్క‌డి ఒక సీనియ‌ర్ నేత‌ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. ప్ర‌స్తుతం కేసీఆర్ కాంగ్రెస్, హ‌రీశ్ కాంగ్రెస్, కేటీఆర్ కాంగ్రెస్, క‌విత కాంగ్రెస్ అంటూ నాలుగు ర‌కాల కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో ఉన్నాయ‌ని చాలా కాలంగా వినిపిస్తోంది. అదే వాదాన్ని బ‌లంగా వినిపించ‌డం ద్వారా రేవంత్ ఫోకస్ అయ్యారు. పీసీసీ అధ్యక్ష ప‌ద‌విని(Revanth) అందుకోగ‌లిగారు. ఇప్పుడు అధిష్టానం ఎదుట సీనియ‌ర్లు వ్య‌తిరేకించే లీడ‌ర్ గా నిల‌బ‌డ్డారు.

Also Read : Rahul Gandhi on TPCC: రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ అసంతృప్తి

ఇటీవ‌ల తెలంగాణ‌కు ఇంచార్జిగా వ‌చ్చిన మాణిక్ రావు థాకూర్ ఫైన‌ల్ నివేదిక‌ను అధిష్టానం వ‌ద్ద ఉంచారు. దానిలో ఏముందో ప‌లు ర‌కాలుగా తెలంగాణ కాంగ్రెస్ చెప్పుకుంటోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని తొలిగిస్తార‌ని కొంద‌రు, ఆయ‌న పాద‌యాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే క్ర‌మంలో సీనియ‌ర్ల‌కు వార్నింగ్ వ‌స్తుంద‌ని మ‌రికొంద‌రు భావిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో క‌ర్ణాట‌క కాంగ్రెస్ వైపు రాజ‌కీయాన్ని రేవంత్ రెడ్డి మ‌ళ్లించారు.

కాంగ్రెస్ పార్టీకి క‌ర్ణాట‌క‌లో బ‌లంగా ఉండే లీడ‌ర్లు అక్క‌డి పీసీసి చీఫ్ శివ‌కుమార్‌, మాజీ సీఎం సిద్దిరామ‌య్య‌. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. వాళ్లిద్ద‌రిలో శివ‌కుమార్ కు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌న్నిహితంగా ఉంటారు. బ‌హుశా ఆయ‌న వ‌ద్ద నుంచి వ‌చ్చిన స‌మాచారాన్ని రేవంత్ రెడ్డి లీకు చేశారా? లేక సిద్దిరామ‌య్య‌తో కేసీఆర్ న‌డిపిన రాజ‌కీయాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని భావించారా? అనేది సందిగ్ధం. వాళ్లిద్ద‌రూ కాకుండా కాంగ్రెస్ పార్టీలో బ‌ల‌మైన లీడ‌ర్ మ‌రొక‌రు క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో పెద్ద‌గా క‌నిపించ‌రు. పైగా 500 కోట్ల సుపారీ ఇచ్చేంత పెద్ద లీడ‌ర్లు ఎవ‌రూ లేర‌ని క‌ర్ణాట‌క కాంగ్రెస్ లోని చ‌ర్చ‌.

క‌ర్ణాట‌క కాంగ్రెస్ కు ప్ర‌స్తుతం పాజిటివ్ వేవ్

క‌ర్ణాట‌క కాంగ్రెస్ కు ప్ర‌స్తుతం పాజిటివ్ వేవ్ ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా స‌ర్వేలు ఇస్తోన్న అంచ‌నాలు. ఆ పార్టీని దెబ్బ‌తీయ‌డానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక కాంగ్రెస్ లీడ‌ర్ కు రూ. 500 కోట్ల సుఫారీ ఇచ్చార‌ని రేవంత్ రెడ్డి చెప్పే మాట‌. అంతేకాదు, కేసీఆర్ కుట్ర‌ను తెలుసుకున్న జేడీఎస్ అధినేత‌, మాజీ సీఎం కుమార‌స్వామి ఖ‌మ్మం స‌భ‌కు దూరంగా ఉన్నార‌ని రేవంత్ రెడ్డి చెప్పిన స్టోరీ. దీంతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం క‌ర్ణాట‌క రాజ‌కీయం వైపు లుక్ వేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గా తీసుకున్న స‌మ‌యంలో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ న‌డిపేందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారా? లేదా రూ. 500 కోట్ల సుఫారీ వ్య‌వ‌హారం రాజ‌కీయ క్రీడ‌లో భాగ‌మా? అనేది స‌ర్వ‌త్రా క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో నడుస్తోన్న సీరియ‌స్ చ‌ర్చ‌.

Also Read : Modi and KCR: ‘మోడీ – కేసీఆర్’ మళ్లీ ఒక్కటవుతారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఖ‌మ్మం వెళ్లిన సంద‌ర్భంగా అధికారిక ప్రారంభోత్స‌వాల్లో కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత భ‌ట్టి విక్ర‌మార్క్ హాజ‌ర‌య్యారు. ఆ విష‌యం హైలెట్ కాక‌ముందే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అప్ర‌మ‌త్తం అయ్యారు. క‌ర్ణాట‌క కాంగ్రెస్ భాగోతాన్ని బ‌య‌ట‌పెట్టేందుకు మీడియా ముందుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి క‌ర్ణాట‌క కాంగ్రెస్ లోని ఒక సీనియ‌ర్ లీడ‌ర్ అంటూ ఆయ‌న్ను కాల్చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. ఒక వేళ సుఫారీ ఆధారాలు ఉంటే బ‌య‌ట పెట్టాలి. కోవ‌ర్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఆ క‌ర్ణాట‌క సీనియ‌ర్ లీడ‌ర్ ఎవ‌రో చెప్పాలి. ఇవ‌న్నీ ఏమీ లేకుండా తెలంగాణ సీఎం క‌ర్ణాట‌క‌లోని 25 నుంచి 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించ‌డం విచిత్రం.