Site icon HashtagU Telugu

Hijab Controversy: అత్య‌వ‌స‌ర విచార‌ణ కుద‌ర‌ద‌న్న సుప్రీం కోర్టు..!

Hijab Supreme Court

Hijab Supreme Court

హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు ఎక్కిన సంగ‌తి తెలిసిందే. క‌న్న‌డ‌లో చెల‌రేగిన హిజాబ్ వివాదంపై తాజాగా క‌ర్నాట‌క హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. విద్యా సంస్థ‌ల్లో హిజాబ్ త‌ప్ప‌ని స‌రికాద‌ని స్ప‌ష్టం చేసిన హైకోర్టు, హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని ధర్మాసనం పేర్కొంది. హిజాబ్ విషయంలో క‌ర్నాట‌క‌ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స‌మ‌ర్థించిన హైకోర్టు, విద్యా సంస్థల ప్రోటోకాల్స్‌ను విద్యార్ధులు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఈ నేప‌ధ్యంలో హిజాబ్ తప్పనిసరి కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిష‌న్ల‌ను స్వీక‌రించిన‌ సుప్రీంకోర్టు అత్య‌వ‌స‌ర విచార‌ణ చేప‌ట్టేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. ఈ క్ర‌మంలో హోలీ సెల‌వుల త‌ర్వాత ఈ పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్ట‌నున్నట్టు చీఫ్ జ‌స్టీస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం తెలిపింది.

ఇక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖ‌లైన‌ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కోరారు. ఈ క్ర‌మంలో విద్యార్ధుల‌కు త్వరలో పరీక్షలున్న నేపథ్యంలో సత్వరమే విచారణ జరపాలని అభ్యర్థించారు. అయితే న్యాయ‌వాది సంజ‌య్ అభ్య‌ర్థ‌న‌ను సీజేఐ ధర్మాసనం అందుకు నిరాకరించింది. దీనిపై త‌మ‌కు కొంత స‌మ‌యం కావ‌ల‌ని, హోలీ సెలవుల తర్వాతే కేసును విచారణకు స్వీకరిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

క‌ర్ణాట‌క‌లోని ఉడుపి జిల్లాలోని ప్ర‌భుత్వ కళాశాల‌లో మొద‌లైన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. హిజాబ్ తీసేసి రావాల‌ని విద్యాసంస్థ‌ల అధికాలు ఆదేశించ‌గా, అందుకు నిరాక‌రించిన కొంద‌రు ముస్లిం విద్యార్థినులు క‌ర్నాట‌క హైకోర్టును ఆదేశించాడు. మ‌రోవైపు ఇంకొంద‌రు హిజాబ్‌ను విద్యాసంస్థ‌ల్లో నిషేధించాలంటూ హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. దీంతో ఇరువ‌ర్గాల వాద‌నలు విన్న హైకోర్టు విద్యాల‌యాల్లోకి హిజాబ్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని, విద్యా సంస్థ‌ల్లో హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది. అయితే ఇప్పుడు ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేర‌గా అత్య‌వ‌స‌ర విచార‌ణ అవ‌స‌రం లేద‌న్న సుప్రీం కోర్టు హోలీ త‌ర్వాత విచార‌ణ చేప‌డ‌తామని స్ప‌ష్టం చేసింది.