Success Story: ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లకు కానిస్టేబుల్ ఉద్యోగం.. ఎక్కడంటే!

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే సమయంలో పోలీస్ కానిస్టేబుల్ (పోలీస్ అకౌంటెంట్) ఉద్యోగానికి

  • Written By:
  • Publish Date - October 26, 2022 / 06:45 PM IST

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే సమయంలో పోలీస్ కానిస్టేబుల్ (పోలీస్ అకౌంటెంట్) ఉద్యోగానికి ఎంపికయ్యారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆడపిల్లల చదువు కోసం అవహేళన చేసిన వారి నోళ్లు మూయించారు. ఈ విజయంలో తమ తండ్రి కృషి చాలా ముఖ్యమని చెబుతున్న ఈ రైతు బిడ్డల విజయగాథను చూద్దాం. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని గ్రామానికి చెందిన వెంకటేశన్ అనే మధ్యతరగతి రైతుకు ముగ్గురు కుమార్తెలు. బిడ్డల చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి వెంకటేశన్ వారి బాధ్యతలు చూసుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లలను బాగా చదివించాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఒకే రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

ముగ్గురు అక్కాచెల్లెళ్లలో మొదటి అమ్మాయి ప్రీతికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె వయస్సు 28 సంవత్సరాలు. ఇంటర్‌తో చదువు ఆపేసింది. రెండో అమ్మాయి వైష్ణవి వయసు 25 ఏళ్లు. ఆమె ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైంది. మూడో అమ్మాయి నిరంజన్ వయసు 22 ఏళ్లు. ఆమె ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ముగ్గురు తోబుట్టువులు ఈ సంవత్సరం తమిళనాడు యూనిఫాండ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TNUSRB) నిర్వహించిన గ్రేడ్- II కానిస్టేబుల్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. దీంతో వారి తండ్రి వెంకటేశం సంతోషం వ్యక్తం చేశారు.

పెద్ద అమ్మాయి ప్రీతి మొదటి ప్రయత్నంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కాగా.. రెండో అమ్మాయి వైష్ణవి నాలుగో ప్రయత్నంలో, చివరి అమ్మాయి నిరంజని మూడో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. తమ తల్లి 20 ఏళ్ల క్రితం చనిపోవడంతో తండ్రి వెంకటేశం తమను కష్టపడి చదివించారని అక్కాచెల్లెళ్లు తెలిపారు. తమ విజయానికి నాన్నే కారణమని గర్వంగా చెప్పారు.

12వ తరగతి వరకు చదివిన వెంకటేశన్ గ్రేడ్-II పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు ఎన్నిసార్లు రాసినా ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అయితే తాను చేయలేని పనిని తన కూతుళ్లు చేశారని, అందుకు తనకు చాలా గర్వంగా ఉందని వెంకటేశన్ అన్నారు. రెండో అమ్మాయి వైష్ణవి మాట్లాడుతూ.. తన తల్లి మరణానంతరం తన తండ్రి వ్యవసాయ పనులతో పాటు ఇంటి పనులు కూడా చూసుకున్నాడని తెలిపింది. మొదటి అమ్మాయి ప్రీతి తిరువళ్లూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శిక్షణ తీసుకుంటుంది. రెండో అమ్మాయి వైష్ణవి తిరువళ్లూరు జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డులో శిక్షణ పొందుతుండగా, మూడో అమ్మాయి నిరంజిని తిరువళ్లూరు జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో శిక్షణ పొందుతోంది.