హిజాబ్ వివాదం పై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పై అసంతృప్తితో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే హిజాబ్ వివాదం నేపధ్యంలో అజ్ఞానం కారణంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు ముందు పరీక్షలకు తప్పిపోయిన విద్యార్థులు, రెండోసారి పరీక్షలకు అవకాశం పొందవచ్చని కర్నాటక ప్రభుత్వం తెలిపింది.
తాజాగా గురువారం అసెంబ్లీలో ఈ అంశం పై చర్చ జరిగింది. ఈ క్రమంలో పరీక్షలు రాయని విద్యార్థులకు రెండో అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ బైరే గౌడ ప్రభుత్వాన్ని కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా, పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ పరీక్షలను బహిష్కరించిన విద్యార్ధులు మళ్ళీ పరీక్షలకు హాజరుకావడానికి అనుమతి లేదని కర్ణాటక న్యాయశాఖ మంత్రి మధుస్వామి అన్నారు. పరీక్షలు యాదృచ్ఛికంగా షెడ్యూల్ చేయబడవని, దీంతో విద్యార్ధులు రెండోసారి పరీక్ష రాసే అవకాశం లేదని స్పష్టం చేసింది.
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 10న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టి వేసిన న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది. మతపరమైన దుస్తుల కోసం పట్టుబట్టకూడదని తీర్పువచ్చేవరకు, క్లాస్ రూంలలో విద్యార్ధులు హిజాబ్‌లు, కాషాయ కండువాలు ధరించవద్దని సూచించింది. దీంతో హిజాబ్ లేకుండా పరీక్షలు రాయమని అనేకమంది ముస్లిం విద్యార్థినులు పరీక్షలను బహిష్కరించిన సంగతి తెలిసిందే.