తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ రాజకీయంగా మరింత బలపడ్డారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడం దీనికి కారణం. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కంచు కోటల్లాంటి పట్టణాల్లోనూ డీఎంకే విజయం సాధించడం ఆయనను తిరుగులేని నాయకునిగా చేసింది. పశ్చిమ తమిళనాడులో ఉన్న కోయంబత్తూరు, సేలం, ఈరోడ్ వంటి నగరాల్లో ఇంతవరకు అన్నాడీఎంసరకే ఆధిపత్యం ఉండేది. ఇక్క కూడా డీఎంకే గెలుపొందడం స్టాలిన్‌కు సంతృప్తి కలిగించింది.
మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి సొంత ప్రాంతమైన ఎడప్పాడిలో కూడా డీఎంకే గెలుపొందడం విశేషం. పేరుకు అన్నాడీఎంకే రెండో స్థానంలో నిలిచినా ఎంతో దిగువున ఉంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అత్యధిక స్థానాలు డీఎంకే ఖాతాలో పడడంతో మిడిల్ క్లాస్ మద్దతు ఆ పార్టీకి లభించినట్టయ్యింది. భవిష్యత్తులో ఇది సత్ఫలితాలు ఇస్తుందని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
మొత్తం 21 కార్పొరేషన్లలో మెజార్టీ రావడంతో డీఎంకేలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. 138 మున్సిపాలిటీలు, 490 టౌన్ పంచాయతీల్లోనూ గణనీయంగా గెలుపొందింది.ఒంటరిగా పోటీ చేసిన బీజేపీలో కూడా ఉత్సాహం నెలకొంది. చాలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డులను గెలుచుకొంది. జీరో ఉన్న చోట ఇన్ని సీట్లను గెలవడం గొప్పేనని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ద్రవిడ సిద్దాంతాలకు అనుగుణంగా జరుగుతున్న పాలనకు ఇది ప్రజలు ఇచ్చిన పురస్కారమని స్టాలిన్ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికలు నిజాయతీగా జరగలేదని, అక్రమాలతోనే విజయం సాధించిందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఏదేమైనా స్టాలిక్ కు ఇది తిరుగులేని విజయమే.