Site icon HashtagU Telugu

Navin Shekharappa: ఉక్రెయిన్‌లో న‌వీన్ మ‌ర‌ణం వెనుక షాకింగ్ నిజాలు

Indian Student Naveen Killed

Indian Student Naveen Killed

ఉక్రెయిన్‌, ర‌ష్యా దేశాల మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న నేప‌ధ్యంలో మంగ‌ళ‌వారం ర‌ష్యా సైనిక ద‌ళాలు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో ప్ర‌భుత్వ భ‌వ‌నాన్ని పేల్చివేయ‌డంతో, క‌ర్నాట‌క‌లోని హ‌వేరీకి చెందిన మెడిక‌ల్ విద్యార్థి న‌వీన్ శేఖరప్ప మరణించిన విష‌యం తెలిసిందే. నిన్న ఉద‌యం ఖార్కీవ్‌లో ప్ర‌భుత్వం భ‌వనాన్ని టార్గెట్ చేసిన ర‌ష్యా సైనికులు, ఆ భ‌వ‌నం పై మిసైల్‌తో దాడి చేశారు. ఈ క్ర‌మంలో అక్క‌డ ప్ర‌భుత్వ భ‌వ‌నం స‌మీపంలో ఉన్న ఒక సూప‌ర్ మార్కెట్ బ‌య‌ట నిల్చుని ఉన్న‌న‌వీన్ బాంబు పేలుడు ధాటికి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ నేప‌ధ్యంలో 21 ఏళ్ల ఈ యువకుడు అయిన న‌వీన్ మరణించ‌డంతో, అతని కుటుంబ స‌భ్యుల‌తో పాటు, యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఉక్రెయిన్​లోని ఖార్కీవ్​లో రష్యా సైన్యం మంగళవారం ఉదయం భీకర దాడులు జరుపుతున్న స‌మ‌యంలో, బంక‌ర్‌లో ఉన్న న‌వీన్ బ‌య‌ట‌కు ఎందుకు వ‌చ్చాడు, ఎలా మ‌ర‌ణించాడు అనే విష‌యాల‌పై అక్క‌డే బంక‌ర్‌లోనే ఉన్న‌ న‌వీన్ స్నేహితుడు శ్రీకాంత్ స్పందించాడు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ఖార్వీవ్‌లో జ‌రిగిన పరిణామాల‌పై శ్రీకాంత్ ఓ క‌న్న‌డ చాన‌ల్‌కు వివ‌రించాడు.

ఉక్రెయిన్ పై ర‌ష్యా వార్ ప్ర‌క‌టించిన త‌ర్వాత కొద్దిరోజులుగా న‌వీన్‌తో పాటు తొమ్మిది మంది విద్యార్థులు కొన్ని రోజులుగా అక్క‌డే బంక‌ర్‌లో ఉంటున్నార‌ట‌. అయితే అక్క‌డ క‌ర్ఫ్యూ తాత్కాలికంగా ముగియ‌డంతో, ఆహారం కొనుగోలు చేసేందుకు న‌వీన్ బంక‌ర్ నుండి బ‌య‌ట‌కు వెళ్ళాడ‌ని, అప్పుడు స‌మ‌యం ఉంద‌యం 06 :30 గంట‌లు అయ్యింద‌ని శ్రీకాంత్ తెలిపాడు. ఆరున్న‌ర‌కు బ‌య‌ట‌కు వెళ్ళిన న‌వీన్ కొద్ది సేప‌టి త‌ర్వాత త‌న‌కు ఫోన్ చేసి, త‌న కార్డుకు డ‌బ్బులు పంపించ‌మ‌న్నాడు. ఆ త‌ర్వాత నవీన్‌కు ఫోన్ చేయ‌గా, అక్క‌డే ఉన్న కొంద‌రు స్థానికులు ఫోన్ ఎత్తి, ర‌ష్యా మిసైల్ దాడిలో న‌వీన్ మృతి చెందాడ‌ని త‌న‌కు చెప్పార‌ని శ్రీకాంత్ వెల్లడించాడు.

ఇక ర‌ష్యా సైనికులు దాడులు చేస్తున్న క్ర‌మంలో. ట్రైన్​ పట్టుకుని పశ్చిమంవైపు వెళ్లాలని అధికారులు మాకు సూచించార‌ని, మేము ఉంటున్న‌ బంకర్​ నుంచి రైల్వే స్టేషన్​ సుమారు 8కిలోమీటర్ల దూరం ఉంద‌ని, అక్క‌డి క్యాబ్​లు ఒక్క‌సారిగా రేట్లు పెంచేయ‌డంతో, ర‌వాణా చాలా ఖరీదుగా మారిపోయింద‌ని శ్రీకాంత్ తెలిపాడు. అయ‌తే మ‌రోవైపు బాంబుల దాడి కొన‌సాగున్న క్ర‌మంలో ముందు బయటకు వెళ్లాలంటేనే మాకు చాలా భయమేసిందని, అయితే కొందరు ధైర్యం చేసి బయటకు వెళ్ళి ట్రైన్​ ఎక్కార‌ని, ఖర్కీవ్​లోని తమ పరిస్థితులను వివరించాడు శ్రీకాంత్​. ఇక నవీన్​ మరణవార్తతో కర్ణాటకలోని అతని గ్రామంలో విషాదం విషాదం అలుముకుంది. ఇకపోతే నవీన్​ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన‌ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై, నవీన్​ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా కృషిచేస్తామని, నవీన్​ కుటుంబ స‌భ్యుల‌కు బొమ్మై హామీనిచ్చారు.