Site icon HashtagU Telugu

TN Boats: తమిళ‌నాడు మ‌త్స్య‌కార ప‌డ‌వ‌ను ఢీకొట్టిన శ్రీలంక కు చెందిన నౌక‌

tamil nadu fishermen

tamil nadu fishermen

శ్రీలంక నౌకాదళానికి చెందిన ఓడ తమిళనాడుకు చెందిన ఒక మత్స్యకార పడవను ఢీకొట్టింది. కచ్చతీవు ద్వీపం సమీపంలో బుధ‌వారం అర్థ‌రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రామనాథపురం జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో ప‌డ‌వ‌ మునిగిపోయింది. అయితే మత్స్యకారులు ప్రమాద హెచ్చరిక చేయ‌డంతో మరొక మత్స్యకార బోటు వారిని రక్షించింది.

ఆల్ మెకనైజ్డ్ బోట్ ఫిషర్మెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.శేషురాజా తెలిపిన వివరాల ప్రకారం రామేశ్వరం నుండి 450 మత్స్యకార పడవలు మధ్యాహ్నం 3 గంటలకు బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని… మత్స్యకారులు శ్రీలంక నావికాదళం అరెస్టు లేదా దాడి జరుగుతుందనే భయంతో వారానికి రెండు రోజులు మాత్రమే చేపల వేటకు వెళుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. తంగచిమడం ఎస్పీ వస్తియాన్‌కు చెందిన మెకనైజ్డ్ బోటులో మత్స్యకారులు కచ్చతీవు సమీపంలో చేపల వేటలో నిమగ్నమై ఉండగా రాత్రి 10.30 గంటల ప్రాంతంలో శ్రీలంక నౌకాదళ నౌక దానిని ఢీకొట్టింద‌ని శుషురాజు తెలిపారు.

ఫిషింగ్ బోట్ కు పగుళ్లు ఏర్పడ్డాయ‌ని.. సముద్రపు నీరు పడవలోకి ప్రవేశించడంతో ఏడుగురు మత్స్యకారులతో ఉన్న పడవ మునిగిపోవడం జ‌రిగింద‌న్నారు. ఢీకొట్టిన శ్రీలంక నౌక అక్క‌డి నుంచి వెళ్లిపోయింద‌ని ఆయ‌న తెలిపారు. అయితే మత్స్యకారులు అలారం మోగించి, వాకీ-టాకీ ద్వారా తోటి మత్స్యకారులను అప్రమత్తం చేశారని.. వారందరినీ మరొక మత్స్యకార పడవ ద్వారా రక్షించి గురువారం ఉదయం తిరిగి ఒడ్డుకు చేర్చారని శేషురాజు తెలిపారు. శ్రీలంక నేవీ తరచూ దాడులు, అరెస్టులతో తమిళనాడు మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతీస్తుంద‌ని…భారత్ – శ్రీలంక మత్స్యకారుల మధ్య శాంతియుతంగా చర్చలు జరిగేలా కేంద్రం, రాష్ట్రాన్ని మేము డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.