North East Monsoon: నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. ఈ సమయంలో, దక్షిణ భారతంలోని ఐదు వాతావరణ సబ్‌డివిజన్లలో వర్షాలకు అనుకూలంగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలిగి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి, ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగింది.
ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కోస్తా, రాయలసీమ, తమిళనాడు/పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో వర్షాలు కురిసే వాతావరణం ఉంటుందని అంచనా. 1971 నుండి 2020 వరకు ఈ ఐదు సబ్‌డివిజన్లలో సగటు 334.13 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి ఉంది, అయితే ఈ ఏడాది సాధారణం కంటే 15 శాతం ఎక్కువ (దీర్ఘకాలిక సగటులో 115 శాతం) వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది.
తమిళనాడులో ఏడాదిలో కురవాల్సిన వర్షపాతంలో ఈ సీజన్‌లోనే 48 శాతం, దక్షిణాదిలోని ఐదు సబ్‌డివిజన్లలో 30 శాతం వర్షపాతం నమోదుకావాల్సి ఉంది. గతేడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో తూర్పు/ఈశాన్య గాలులు ప్రారంభమవ్వడంతో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సీజన్‌లో దక్షిణ కోస్తా, తమిళనాడుకు తుఫాన్‌లు తాకుతాయని సూచించారు. పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు ‘లానినా’గా మారే అవకాశం ఉన్నా, ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో మంచి వర్షాలు కురిశాయని వాతావరణ నిపుణులు చెప్పారు. ఉత్తర, ఈశాన్య, తూర్పు భారతంలో కొన్ని ప్రాంతాలు తప్ప మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావడం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చింది.