త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ మ‌రో సంచ‌ల‌నం..ఆ మ‌హిళ‌లంద‌రికీ రేష‌న్ కార్డులు

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక నుంచి ఒంట‌రి మ‌హిళ‌లు ఎవ‌రికైనా రేష‌న్ కార్డు ఇవ్వాల‌ని ఆదేశించాడు. ఆ మేర‌కు నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించాల‌ని అధికారుల‌కు సూచించాడు. కుటుంబంతో విడిపోయినా, భ‌ర్త నుంచి దూరంగా ఉన్న మ‌హిళ‌ల‌కు రేష‌న్ కార్డుల‌ను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఇక నుంచి ఇవ్వ‌నుంది.

  • Written By:
  • Publish Date - October 29, 2021 / 08:00 PM IST

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక నుంచి ఒంట‌రి మ‌హిళ‌లు ఎవ‌రికైనా రేష‌న్ కార్డు ఇవ్వాల‌ని ఆదేశించాడు. ఆ మేర‌కు నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించాల‌ని అధికారుల‌కు సూచించాడు. కుటుంబంతో విడిపోయినా, భ‌ర్త నుంచి దూరంగా ఉన్న మ‌హిళ‌ల‌కు రేష‌న్ కార్డుల‌ను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఇక నుంచి ఇవ్వ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడాకుల ప‌త్రం చూపిస్తేనే రేష‌న్ కార్డు మంజూరు చేసే అవ‌కాశం ఉండేది. కుటుంబం నుంచి దూరంగా ఉన్న మ‌హిళ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు కార్డ్ ఉండేదికాదు. స్టాలిన్ కొత్త ఆదేశాల మేర‌కు వ్య‌క్తిగ‌త డిక్ల‌రేష‌న్ ఇస్తే వెంట‌నే ఒంట‌రి మ‌హిళ‌లు రేష‌న్ కార్డును పొంద‌డానికి స్టాలిన్ వీలు క‌ల్పించాడు.
దేశంలోని మిగిలిన రాష్ట్రాల సీఎంల కంటే స్టాలిన్ భిన్నంగా పాల‌న సాగిస్తున్నాడు. నిరాడంబ‌రంగా ప్ర‌జా సేవ చేయడానికి ఏ మాత్రం సంకోచించ‌కుండా ముందుకు వెళుతున్నాడు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి రోజుల్లో ప్రైవేటు ఆస్ప‌త్రుల‌ను ప్ర‌భుత్వ ఆధీనంలోకి తీసురావ‌డం ద్వారా కోవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాడు. ఆ స‌మ‌యంలో అంద‌రికీ ఉచితంగా రేష‌న్ అందించాడు. స్వ‌ర్గీయ జ‌య‌ల‌లిత ప్ర‌వేశ‌పెట్టిన అన్ని ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాడు. అంతేకాదు, ఆమె ఫోటోతో ఉన్న వాటిని య‌థాత‌దంగా కొన‌సాగిస్తున్నాడు.

అమ్మ క్యాంటిన్ల నుంచి జ‌య పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌రింత వేగంగా అందించే దిశ‌గా స్టాలిన్ పాల‌న సాగిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా రేష‌న్ కార్డుల‌ను ఒంటరి మ‌హిళ‌లు అంద‌రికీ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుని ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. స‌హ‌జంగా విడాకుల ప‌త్రం చూపే వ‌ర‌కు రేష‌న్ కార్డు ఒంట‌రి మ‌హిళ‌కు ఇవ్వ‌రు. పిల్ల‌ల‌తో వేరుగా ఉంటున్న మ‌హిళ‌ల‌కు రేషన్ కార్డు ఇవ్వాలి అంటే కుటుంబంతో క‌లిసి ఉన్న రేషన్‌కార్డు నుంచి ఆమె పేరు తొలిగించాలి. అందుకు భ‌ర్త స‌హ‌కారం అవ‌స‌రం అవుతుంది. పెళ్లి కాకుండా తండ్రితో వేరుగా ఉండే మ‌హిళ‌లకు కూడా రేష‌న్ కార్డు కావాలంటే స‌వాల‌క్ష కండీష‌న్లు ఉండేవి. ఇప్పుడు కేవ‌లం రెవెన్యూ అధికారి, జోన‌ల్ పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారికి వ్య‌క్తిగ‌త డిక్ల‌రేష‌న్ ఇస్తే స‌రిపోతుంది. వెంట‌నే రేష‌న్ కార్డును పొందే అవ‌కాశం స్టాలిన్ క‌ల్పించాడు.
కోవిడ్ స‌మ‌యంలో చాలా మంది ఒంట‌రి మ‌హిళ‌ల‌కు రేష‌న్ అంద‌లేద‌ని త‌మిళ‌నాడు సీఎం గుర్తించాడు. పిల్ల‌ల‌తో క‌లిసి విడిగా ఉంటోన్న మ‌హిళ‌లు ఆ స‌మ‌యంలో చాలా ఇబ్బంది ప‌డ్డార‌ని స్టాలిన్ దృష్టికి వెళ్లింది. అందుకే, తాజాగా ఒంట‌రి మ‌హిళ‌ల‌కు రేష‌న్ కార్డులు ఇచ్చే అంశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌.