Site icon HashtagU Telugu

New CM: సిద్ధరామయ్యే కర్ణాటక కొత్త సీఎం?… అధికారిక ప్రకటనే తరువాయి

Karnataka

New Cm

New CM: కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎంపిక ఎప్పుడూ ప్రహసనమే… ఏ రాష్ట్రమైనా సీఎంగా ఎవరుండాలనేది హైకమాండే కు సవాల్ గా మారుతుంటుంది. తాజాగా కర్ణాటకలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఎప్పటిలానే రేసులో ఇద్దరు కంటే ఎక్కువ ఉండడంతో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై రెండురోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

రేసులో నిలిచిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో కీలకంగా నిలిచారు. అయితే ముందు నుంచీ అనుకున్నట్టుగానే డీకే కంటే సిద్దరామయ్యకే అవకాశాలుండగా.. చివరకు అదే నిజమైనట్టు తెలుస్తోంది. డీకే కంటే సీనియర్ సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటనే మిగిలింది. ఏ క్షణమైనా సిద్దరామయ్యే పేరును కర్ణాటక కొత్త సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశముందని ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నిజానికి సోమవారం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. రోజంతా హైడ్రామా నడిచింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న షిండే బృందం ఢిల్లీ వెళ్ళి హైకమాండ్ కు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అయితే సిద్దరామయ్య, డీకే శివకుమార్ లను ఇద్దరినీ హైకమాండ్ ఢిల్లీకి పిలవగా.. కేవలం సిద్దరామయ్య మాత్రమే వెళ్ళారు. బెంగళూరులోనే ఉండిపోయిన డీకే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

తనకు కడుపు నొప్పిగా ఉందని, ప్రయాణం చెయ్యకుండా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు సమాచారమిచ్చారు. దీనికి తోడు ఇస్తే తనకు సీఎం పదవి ఇవ్వాలని, లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవి, వేరే మంత్రి పదవలు తనకు ఏమాత్రం అవసరం లేదని, తాను కాంగ్రెస్ పార్టీకి సామాన్య కార్యకర్తగా, ఓ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటానని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు తేల్చి చెప్పారని తెలిసింది.

మరోవైపు ఢిల్లీలోనే మకాం వేసిన సిద్దరామయ్య తన లాబీయింగ్ లో బిజీగా గడిపారు. సోనియా గాంధీకి ఎంతో నమ్మకస్తుడు అయిన కేసీ వేణుగోపాల్ ను ప్రసన్నం చేసుకుని తనకు సీఎం పదవి ఇప్పించాలని వేడుకున్నారు. దీంతో అన్ని పరిస్థితులూ కలిసొచ్చిన సిద్దరామయ్యే కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన సమయంలో ప్రమాణ స్వీకార తేదీ వెల్లడించే అవకాశముంది. అయితే అలకబూనిన డీకే శివకుమార్ ను అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో వేచి చూడాలి.

Also Read: Karnataka 2023 : క‌ర్ణాట‌క కాంగ్రెస్ లో చీలిక‌? కొత్త CBI బాస్ ఎఫెక్ట్!

Exit mobile version