Siddaramaiah Cabinet: సిద్ధ‌రామ‌య్య కేబినెట్‌లో ఒక్క‌రే మ‌హిళా మంత్రి.. శాఖ‌ల కేటాయింపుపై కొన‌సాగుతున్న ఉత్కంఠ‌

తాజాగా సిద్ధిరామ‌య్య ప్ర‌భుత్వం కేబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్టింది. రెండో ద‌ఫా కేబినెట్ లో ఏకంగా 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. 24 మందిలో ఒక్క‌రే మ‌హిళ ఎమ్మెల్యే ల‌క్ష్మీ హెబ్బాళ్క‌ర్ కు మంత్రిగా అవ‌కాశం ద‌క్కింది.

  • Written By:
  • Publish Date - May 27, 2023 / 08:00 PM IST

క‌ర్ణాట‌క(Karnataka) అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్(Congress) పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం విధిత‌మే. 135 స్థానాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డంతో ఇత‌ర పార్టీల స‌హ‌కారం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 20న సీఎంగా సిద్ధ‌రామ‌య్య‌(Siddaramaiah), డిప్యూటీ సీఎంగా డీకే శివ‌కుమార్(DK Shivakumar) లు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వీరితో పాటు మ‌రో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. తాజాగా సిద్ధిరామ‌య్య ప్ర‌భుత్వం కేబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్టింది. రెండో ద‌ఫా కేబినెట్ లో ఏకంగా 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. 24 మందిలో ఒక్క‌రే మ‌హిళ ఎమ్మెల్యే ల‌క్ష్మీ హెబ్బాళ్క‌ర్ కు మంత్రిగా అవ‌కాశం ద‌క్కింది. వీరంతా శ‌నివారం బెంగ‌ళూరులోని రాజ్‌భ‌వ‌న్‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 11 మంది మ‌హిళ‌ల‌ను బ‌రిలోకి దింపింది. వీరిలో న‌లుగురు మాత్ర‌మే విజ‌యం సాధించారు. 2013-18 సంవ‌త్స‌రంలో సిద్ధ‌రామ‌య్య సీఎంగా ఉన్న స‌మ‌యంలోనూ అత‌ని కేబినెట్‌లో ఒక్క‌రే మ‌హిళా మంత్రి కొన‌సాగారు. గ‌త బీజేపీ ప్ర‌భుత్వం హ‌యాంలోనూ ఒక్క‌ మ‌హిళా ఎమ్మెల్యే మాత్ర‌మే మంత్రిగా కొన‌సాగారు. ఇదిలాఉంటే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసేవారి జాబితాను త‌యారు చేసే క్ర‌మంలో కాంగ్రెస్ ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపింది. సిద్ధ‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్ద‌ల‌తో విడివిడిగా బేటీ అయ్యారు. ప‌లుసార్లు చ‌ర్చ‌ల త‌రువాత శుక్ర‌వారం అర్థ‌రాత్రి స‌మ‌యంలో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోయే 24 మంది జాబితాను విడుద‌ల చేశారు. అయితే, మంత్రిగా అవ‌కాశం ద‌క్క‌ని ప‌లువురు ఎమ్మెల్యేల వ‌ర్గీయులు కాంగ్రెస్ అధిష్టానంకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కుసైతం దిగారు.

సిద్ధ‌రామ‌య్య కేబినెట్‌లో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఎవ‌రికీ ఇప్ప‌టి వ‌ర‌కు శాఖ‌ల కేటాయింపు చేయ‌లేదు. రెండురోజుల్లో మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు ఉంటుంద‌ని తెలుస్తుందో కీల‌క శాఖ‌ల కోసం మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వారు పైర‌లు విస్తృతం చేశారు. అయితే, శాఖ‌ల కేటాయింపు విష‌యంలోనూ కాంగ్రెస్ హైక‌మాండ్ ద్వారా నిర్ణ‌యం జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. సిద్ధ‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్‌, ఇత‌ర కాంగ్రెస్ నేత‌ల అబిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని శాఖ‌ల కేటాయింపు చేస్తార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఎవ‌రికి ఏ శాఖ కేటాయిస్తార‌నే ఉత్కంఠ కోన‌సాగుతోంది.

 

Also Read : Karnataka: బ‌స్సులో టికెట్ కొనం.. విద్యుత్ బిల్లులు క‌ట్టం.. క‌ర్ణాట‌క‌లో గోల షురూ