Tamil Nadu: వేడెక్క‌నున్న త‌మిళ రాజ‌కీయాలు..?

  • Written By:
  • Updated On - March 4, 2022 / 10:22 AM IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ తిరిగి అన్నాడీఎంకే గూటికి చేరనున్నారనే వార్త‌లు త‌మిళ‌నాడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. జ‌యలలిత మరణం త‌ర్వాత‌ తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితి ఘోరంగా దెబ్బ తిన్న సంగ‌తి తెలిసిందే. వరుస ఓటములతో అన్నాడీఎంకే ఉక్కిరిబిక్కిరి అయింది. జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు పార్టీని గుప్పిట్లోకి తీసుకున్నాక‌, ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించే క్ర‌మంల‌లో వీరిద్ద‌రి మధ్య విభేదాలు తారాస్థాయికి చేర‌డంతో ఆ రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీని గాడిన‌పెట్ట‌లేక‌పోయారు.

మ‌రోవైపు అప్ప‌ట్లోనే అన్నాడీఎంకే పార్టీని హస్తగతం చేసుకోవాలని భావించిన శ‌శిక‌ళ‌ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడం పార్టీని మరింత దెబ్బతీసింది. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడు అన్నాడీఎంకే పుంజుకోవాలంటే.. శ‌శిక‌ళ‌ను పార్టీలోకి తీసుకొస్తేనే బెట‌ర్ అని ఆ పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయని స‌మాచారం. ఈ క్ర‌మంలో తాజాగా అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్ సెల్వంతో పలువురు అన్నాడీఎంకే ముఖ్య సహాయకులు పాల్గొని చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు స‌మాచారం. ఈ సమావేశంలో భాగంగా పార్టీ ఓటమి, వర్గ పోరు గురించి చర్చించారని తెలుస్తోంది. శశికళ మళ్లీ వ‌స్తే త‌ప్ప రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీ నిలదొక్కుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని ప‌లువురు వ్యక్తం చేశారని తెలుస్తోంది.

దీంతో పన్నీర్ సెల్వం వర్గం శశికళను పార్టీలో తిరిగి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఇదే అంశంపై ఓపీఎస్ వర్గం శుక్రవారం ఓ తీర్మానం చేసి, పార్టీ అధిష్టానానికి పంపనున్నారు. ఆ తర్వాత ఓపీఎస్, మరో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి, పార్టీ సర్వసభ్య సమావేశమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, శశికళ చేరికను ఈపీఎస్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరోవైపు అన్నాడీఎంకే శశికళను చేర్చుకుంటే తన పార్టీని అన్నాడీఎంకే విలీనం చేసే అంశాన్ని పరిశీస్తామని శశికళ బంధువు, అమ్మా మక్కల్ మున్నేట్ర కళకం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రకటించారు. దీంతో శశికళను తిరిగిపార్టీలోకి తీసుకుంటే మ‌ళ్ళీ తమిళ రాజకీయాలు వేడెక్కడం ఖాయమ‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అంటున్నారు. నిజంగానే శ‌శిక‌ళ అన్నాడీఎంకే పార్టీలోకి ఎంట్రీ ఇస్తే.. సీయం స్టాలిన్‌కు ఎదురు దెబ్బే అని అక్క‌డి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.