Sea Cucumbers : తమిళనాడులోని రామేశ్వరం తీరంలో భారత తీర రక్షక దళానికి దాదాపు రూ.80 లక్షల విలువైన సముద్రపు దోసకాయలు దొరికాయి. దీంతో వీటిపై అంతటా చర్చ జరుగుతోంది. సముద్రపు దోసకాయలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాటి గురించి మనం కూడా తెలుసుకుందాం..
Also Read :Telangana Ministers : బీసీ సంఘాల మహాధర్నా.. రేపు ఢిల్లీకి మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు
సముద్ర దోసకాయలు అంటే..
సముద్ర దోసకాయలు అంటే.. సముద్రంలో పెరిగే కూరగాయలు అని అనుకుంటున్నారా ? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. అవి కూరగాయలు కాదు.. జలచరాలు. సముద్రంలోని లోతు ప్రాంతాల్లో జీవించే జీవులు. చూడటానికి దోసకాయల్లా కనిపించే జీవులు ఇవి. అందుకే వీటికి సముద్ర దోసకాయలు అనే పేరు వచ్చింది. వీటి శరీరం మృదువుగా ఉంటుంది. సముద్రపు అడుగు భాగాన్ని శుభ్రంగా ఉంచడంలో సముద్ర దోసకాయలు కీలక పాత్ర పోషిస్తాయట.
ఎందుకంత ధర ?
సముద్ర దోసకాయలకు(Sea Cucumbers) ధర చాలా ఎక్కువ. వీటికి స్మగ్లర్లు కిలోకు రూ.30వేలు చొప్పున లెక్క కట్టి అమ్మేస్తారట. చైనా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లోని ఆహార ప్రియులు సముద్ర దోసకాయలను కొనేందుకు ఎంధ ధరైనా చెల్లిస్తారట. అక్కడి ప్రముఖ రెస్టారెంట్లు అక్రమ మార్గాల్లో సముద్ర దోసకాయలను కొని, భారీ ధరలకు వంటకాలను తయారు చేసి విక్రయిస్తుంటాయి. పలు ఔషధాల తయారీలోనూ వీటిని వినియోగిస్తారు. ఆర్థరైటిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు సముద్ర దోసకాయలు తింటే మంచిదనే ప్రచారం ఉంది. సముద్ర దోసకాయలను తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అంటారు. ఈ కారణాల వల్లే వీటికి భారీ ధర ఉంది.
ఆ ఓడరేవుల నుంచి స్మగ్లింగ్
మన భారత దేశంలోని తీర ప్రాంతాల్లో ఉన్న సముద్ర జలాల్లో దొరికే సముద్ర దోసకాయలను స్మగ్లర్లు కొని విదేశాలకు అక్రమ మార్గాల్లో ఎగుమతి చేస్తుంటారు. ఇలా స్మగ్లింగ్ చేసే క్రమంలోనే రూ.80 లక్షలు విలువైన సముద్ర దోసకాయలను రామేశ్వరం సమీపంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. సముద్ర దోసకాయలు తమిళనాడు తీరప్రాంతాలలో, అండమాన్-నికోబార్ దీవులలో ఎక్కువగా లభిస్తాయని సమాచారం. రామేశ్వరం, ట్యూటికోరిన్ ఓడరేవులను కేంద్రంగా చేసుకొని సముద్ర దోసకాయలను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తుంటారు.