Site icon HashtagU Telugu

Tamilnadu Politics : అన్నాడీఎంకే పార్టీ చిన్నమ్మ చేతుల్లోకి వెళుతోందా? శశికళ కొత్త స్కెచ్చేంటి?

Sasikala

Sasikala

జయలలిత ఉన్నన్నాళ్లూ అనధికారికంగా అధికారం, డబ్బు, హోదా, పరపతి, పేరు ప్రతిష్టలు.. అబ్బో ఒకటేమిటి.. అన్నీ ఉండేవి. కానీ జయలలిత మృతి తరువాత ఆమె నెచ్చెలి శశికళ సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు అన్నాడీఎంకేలోకి వెళదామంటే.. ఓపీఎస్, ఈపీఎస్ లు రానివ్వడం లేదు. సరే.. కొత్త పార్టీతో ప్రయోగం చేద్దామా అంటే కమలనాథులు కస్సుబుస్సులాడుతున్నారు. మరిప్పుడు చిన్నమ్మ పరిస్థితి ఏమిటి? అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవడానికి ఆమె మాస్టర్ ప్లాన్ వేశారు.గతంలో కమలనాథులతో పెట్టుకుంటే ఏమయ్యిందో శశికళకు తెలుసు. అందుకే గొడవలొద్దు.. కాంప్రమైజ్ అనే స్థాయికి వచ్చారు. బీజేపీ అందుకే ఇప్పుడు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా అన్నాడీఎంకేను చేతుల్లోకి తీసుకోవచ్చని.. జయలలితలా పార్టీని ఏలొచ్చని ఆశపడుతున్నారు. దానికి ఈమధ్య చేసిన ఆధ్యాత్మిక పర్యటనను ఉదాహరణగా చూపిస్తున్నారు.

పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో అన్నాడీఎంకేలో కూడా లుకలుకలు మొదలయ్యాయి. వర్గ రాజకీయాలు పెరిగాయి. అందుకే ఆమధ్య శశికళ.. ఆధ్యాత్మిక పర్యటన పేరుతో తమిళనాడులోని దక్షిణాది జిల్లాలను చుట్టొచ్చారు. దానికి అన్నాడీఎంకే వర్గాలు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశాయి. అందుకే పార్టీ క్యాడర్ అంతా తనతోనే ఉందని ఆమె నమ్ముతున్నారు.శశికళ టూర్ లో.. ఆమెతోపాటు పన్నీర్ సెల్వం సోదరుడు రాజా కూడా ఉన్నారు. గతంలోనే చిన్నమ్మను రెండుసార్లు కలుసుకున్నందుకు పార్టీ ఆగ్రహించి బహిష్కరించింది. కానీ ఆయన మాత్రం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళనే గుర్తిస్తానని.. తనను పార్టీ నుంచి బహిష్కరించే అధికారం ఆమెకే ఉందని తేల్చేశారు. ఇలాంటి పరిణామాలన్నీ చిన్నమ్మకు ధైర్యాన్నిస్తున్నాయి.

గతంలో పన్నీర్ సెల్వం మాత్రం శశికళను తిరిగి పార్టీలోకి ఆహ్వానించే విషయమై చర్చించినా పెద్ద స్పందన రాలేదు. అందుకే డైరెక్ట్ గా బీజేపీ అధిష్టానాన్ని కలుసుకుంటే.. పార్టీ రిమోట్ ను తన చేతుల్లో పెడుతుందని ఆమె విశ్వసిస్తున్నారు. దీనికోసం రహస్య మంతనాలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. శశికళ స్కెచ్ ని గమనించిన పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు మరో స్కెచ్ వేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు వేగంగా జరిపి..సర్వసభ్య మండలి సమావేశం జరపడానికి పావులు కదుపుతున్నారు. దీని ద్వారా శశికళ ప్రయత్నాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. కానీ బీజేపీ తలుచుకుంటే మాత్రం అన్నాడీఎంకేలోకి చిన్నమ్మ ఎంట్రీ ఖాయంగానే కనిపిస్తోంది.

Exit mobile version