Site icon HashtagU Telugu

Sasikala: పేరు, ఇల్లు మారిస్తే సీఎం అవుతానని భావిస్తున్న శశికళ? అందుకే ఆ మార్పా?

Sasikala

Sasikala

అదృష్టం వీధి గుమ్మం దగ్గర ఆగిపోతే.. దురదృష్టం మాస్టర్ బెడ్ రూమ్ లో ముసుగేసుకుని పడుకుంది అని ఓ సినిమా డైలాగ్ ఉంది. తమిళనాడులో శశికళ పరిస్థితి అలాగే ఉంది. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు చిన్నమ్మ ఓ వెలుగు వెలిగింది. పార్టీలో ఆమె చెప్పిందే వేదం. పైకి జయలలిత వాయిస్ వినిపించినా.. పరోక్షంగా శశికళే చక్రం తిప్పేవారని అంటారు. అలాంటి ఆమెను అన్నాడీఎంకే లో ఇప్పుడు పట్టించుకున్నవారే కరువైపోయారు. జయలలిత మరణం తరువాత ఆమె జాతకం మొత్తం మారిపోయింది. అందుకే పేరు మార్చుకుంటే మళ్లీ మహర్దశ ఉంటుందని ఆమెకు జ్యోతిష్యులు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.

అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. దానికోసమే ఆధ్యాత్మిక పర్యటనలు కూడా చేశారు. అయినా పార్టీ వర్గాలు సరిగా స్పందించలేదు. శశికళపై ఇప్పుడు వివిధ కేసులు ఉన్నాయి. దాంతోపాటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి కేసు కూడా కోర్టులో ఉంది. పైగా ఆమె ఆస్తులు చాలావరరకు కుటుంబ సభ్యుల దగ్గరే ఉన్నాయి. దీంతో వారు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి. ఇప్పుడు కేసులును ఎదుర్కోవాలన్నా, ఆస్తులను కాపాడుకోవాలన్నా బంధుమిత్రుల సాయం లేనిదే శశికళ అడుగు కూడా వేయలేకపోతున్నారు. అందుకే తన తమ్ముడు దినకరన్ తోపాటు తన భర్త నటరాజన్ సోదరులు, వదిన ఇళవరసి వారసులు ఎలా చెబితే అలా ఆమె నడుచుకుంటున్నట్టు తెలుస్తోంది. జయలలితకు సహాయకుడిగా చేసిన పూంగుండ్రన్ ను శశికళ పిలిచారు. తనకు సహాయకుడిగా ఉండాలని కోరారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు.

ఏ పని చేద్దామని తలపెట్టినా అది విజయవంతం కాకపోవడంతో శశికళ జ్యోతిష్యులను సంప్రదించారు. దీంతో వాళ్లు ఆమె పేరుతో పాటు ఉంటున్న ఇంటిని మార్చాలని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. శశికళ కూడా దానికి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Exit mobile version