Site icon HashtagU Telugu

Karnataka: కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై వివాదం.. రాత్రి వేళ అసెంబ్లీలో కాంగ్రెస్ నిరసనలు

Karnataka Assembly Imresizer

Karnataka Assembly Imresizer

కర్ణాటకలో వివాదాల సమయం నడుస్తోంది. హిజాబ్ వివాదమే ఇంకా చల్లారలేదనుకుంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని మరొక అంశం టెన్షన్ పెడుతోంది. రాష్ట్ర మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప.. జాతీయ జెండాను కాషాయరంగుతో మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది. ఆయనను బర్తరఫ్ చేయాలని.. దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని.. అప్పటివరకు అసెంబ్లీలోనే ఉంటామని.. నిరసన తెలుపుతామని చెప్పింది.

రెండు రోజులుగా కర్ణాటక అసెంబ్లీ నిరసనలతో హోరెత్తింది. రెండో రోజు వాయిదాల పర్వం నడిచిన తరువాత కాంగ్రెస్ శాసనసభ్యులు సభలోనే ఉండిపోయారు. దీంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పలు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ నేత, లెజిస్లేచర్ నాయకుడిగా ఉన్న సిద్ధరామయ్యతో చర్చలు జరిపినా ఫలితం లేదు.

రెండు గంటలపాటు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపామని, అసెంబ్లీలో నిద్రించవద్దని కోరామని అయినా వాళ్లు వినలేదన్నది ప్రభుత్వం మాట. ఆఖరికి స్పీకర్ చెప్పినా వినలేదని యడియూరప్ప అన్నారు.
కానీ కాంగ్రెస్ మాత్రం పట్టువీడలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ తో పాటు కర్ణాటక కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలోనే ఉండిపోయారు. రాత్రి భోజనం కూడా అసెంబ్లీ క్యాంటీన్ లోనే చేశారు.

కాంగ్రెస్ మాత్రం ఈశ్వరప్ప వ్యాఖ్యలపై భగ్గుమంటోంది. అసలు ఈశ్వరప్ప ఏం అన్నారంటే.. భగవాధ్వజ్.. అంటే కాషాయ జెండా భవిష్యత్తులో ఎప్పుడైనా జాతీయ జెండాగా మారవచ్చని.. ఎర్రకోట నుంచి దానిని ఎగరవేయవచ్చని వ్యాఖ్యలు చేశారు. కాని ఇప్పుడు త్రివర్ణపతాకమే జాతీయ జెండా అని దానిని అందరూ గౌరవించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను ఖండించింది. ఈ వివాదంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది.

ఈశ్వరప్ప మాటలపై బీజేపీ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు చట్టవిరుద్ధం కాదని చెప్పింది. అసెంబ్లీలో గతంలో ప్రజాసమస్యలపై మాత్రమే రాత్రిపూట నిరసనలు జరిగాయని.. ఇప్పుడు మాత్రం రాజకీయ మైలేజ్ కోసం కాంగ్రెస్ ఇలా చేస్తోందని విమర్శించింది. చివరకు ఈ వివాదాన్ని ముగించడానికి స్పీకర్.. ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని నిర్వహించినా ఫలితం కనిపించలేదు. ఈశ్వరప్పపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న కాంగ్రెస్ వాయిదా తీర్మాన్ని స్పీకర్ ఆమోదించలేదు.

కర్ణాటక అసెంబ్లీలో చివరిసారిగా 2019లో ఇలా రాత్రిపూట నిరసనలు జరిగాయి. అప్పటి జనతాదళ్-కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి యడియూరప్ప బీజేపీ శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీలో రాత్రిపూట నిరసన తెలిపారు.