Site icon HashtagU Telugu

Savarkar Poster: కర్ణాటక శివమొగ్గలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ.. వీర సావర్కర్‌ పోస్టర్ పై ఉద్రిక్తత!!

Karnataka

Karnataka

కర్ణాటకలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది.శివమొగ్గలోని అమీర్‌ అహ్మద్‌ సర్కిల్‌లో వీర సావర్కర్‌ పోస్టర్ వెలిసింది. పలు హిందూ సంఘాలే ఆ పోస్టర్‌ను ఏర్పాటు చేశాయంటూ కొందరు స్థానిక ముస్లిం యువత ఆందోళనకు దిగారు. సావర్కర్‌ ఫ్లెక్సీని తొలగించేందుకు కూడా వారు యత్నం చేశారు.దీనిని వ్యతిరేకిస్తూ హిందూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోస్టర్ ను తీసేయొద్దని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో పోలీసులు శివమొగ్గ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

సూరత్‌కల్ లోనూ..

మరోవైపు మంగళూరులోనూ ఇలాంటి సంఘటనే ఎదురైంది. సూరత్‌కల్ జంక్షన్‌ పేరును సావర్కర్ గా మారుస్తూ  బ్యానర్‌ ఏర్పాటు చేశారు. అయితే.. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆ బ్యానర్‌ను తొలగించారు. ఉత్తర మంగళూరు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే భరత్‌ షెట్టీ అభ్యర్థనతో సర్కిల్‌కు సావర్కర్‌ పేరు పెట్టేందుకు నగర పాలక సంస్థ ఆమోదం తెలిపింది. అధికారికంగా పేరు మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో సూరత్‌కల్‌ సర్కిల్‌ చాలా సున్నితమైన ప్రాంతమని, సావర్కర్‌ పేరు పెట్టటాన్ని తాము తీవ్రంగా వ‍్యతిరేకిస్తున్నామని ఎస్‌డీపీఐ వెల్లడించింది.