మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగంపై ప్రముఖ లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావును సోమవారం కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక చిత్రదుర్గలోని ప్రముఖ మురుగ మఠానికి ఆయన ప్రధాన పీఠాధిపతి. ఆయన్ను హవేరి జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. మఠం నిర్వహిస్తున్న సంస్థలో ని విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు మైనర్ల తరపున ఫిర్యాదు చేయడంతో మైసూరు నగర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతనిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మఠం ఆధీనంలో పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు మైసూరులోని NGO ‘ఓడనాడి సేవా సంస్థ’ను సంప్రదించారు. ఆ ఎన్జీవో వాళ్ల సమస్యను జిల్లా బాలల సంక్షేమ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సంస్థ వార్డెన్‌తో సహా మరో నలుగురిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. మురుగ మఠం పరిధిలోని హాస్టల్‌లో ఉంటున్న 15, 16 ఏళ్ల బాలికలు మూడున్నరేళ్లుగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇది చాలా ఏళ్లుగా జరుగుతోంది. కానీ భయంతో విషయాన్ని పిల్లలు బయటపెట్టలేదని ఆ సంస్థ గుర్తించింది. బాలల హక్కులను పరిరక్షించడం కోసం పోరాటం చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.
కర్నాటక ప్రభుత్వం ఏం చెప్పింది?
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, పోలీసులు ఈ ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారని, దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజం బయటపడుతుందని అన్నారు. చిత్రదుర్గ పోలీసులు పోక్సో, కిడ్నాప్ కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ జరుగుతున్నప్పుడు దానిపై చర్చించడం సరికాదు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెల్లడిస్తారని సీఎం అన్నారు.
బీజేపీకి చెందిన కేఎస్ ఈశ్వరప్ప ఆరోపణలపై తాను బాధపడ్డానని, ఆ వార్తలు అవాస్తం కావాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.‘‘చిత్రదుర్గ మురుగ మఠం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. నేను వార్తతో బాధపడ్డాను. వార్తలు అసహ్యంగా ఉన్నాయి. ఆ వార్త అబద్ధమని ప్రార్థిస్తాను. సమస్యపై విచారణ జరుగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత ఏదైనా చెప్పొచ్చు. దీనికి ముందు ఊహించడం సాధ్యం కాదు. విచారణలో ఏది వచ్చినా మేము అంగీకరించాలి. ” అన్నారు.