Puneeth Rajkumar: ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో హీరో పునీత్ అంత్య‌క్రియ‌లు

ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్య‌క్రియలను క‌ర్ణాట‌క ప్రభుత్వం అధికారిక లాంఛ‌నాల‌తో నిర్వ‌హించ‌బోతుంది.

  • Written By:
  • Updated On - October 30, 2021 / 10:16 PM IST

ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్య‌క్రియలను క‌ర్ణాట‌క ప్రభుత్వం అధికారిక లాంఛ‌నాల‌తో నిర్వ‌హించ‌బోతుంది. బెంగుళూరు నందినీ లేవౌట్లోని కంఠీర‌వ స్టూడియోలో ఆదివారం ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంతిమ‌యాత్ర‌, అంత్య‌క్రియ‌ల‌ను జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కంఠీర‌వ స్టూడియోల‌నే క‌న్న‌డ లెజెండ్ హీరో రాజ్ కుమార్ అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. అక్క‌డే కుమారుడు పునీత్ అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేశారు. ఆ మేర‌కు కర్నాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమై ఆదేశాలు జారీ చేశాడు.


పునీత్ పార్థివ దేహాన్ని శుక్ర‌వారంనాడు సీఎం బ‌సవ‌రాజ్ సంద‌ర్శించి, నివాళులు అర్పించాడు. అభిమాన హీరో పునీత్ ను క‌డసారి చూపు కోసం వేలాది మంది కంఠీర‌వ స్టూడియో వ‌ద్ద క్యూ క‌ట్టారు. బాలీవుడ్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన సినీ క‌ళాకారులు పునీత్ మ‌ర‌ణంపై దిగ్భ్రాంతికి గుర‌య్యారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌ముఖులు నివాళులు, సంతాపం తెలియ‌చేశారు. అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పునీత్ ఫోటోలు, వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు. పునీత్ సేవాభావాన్ని కొనియాడుతూ సామాన్యులు సైతం పోస్ట్ లు పెట్టారు.

అక్టోబ‌ర్ 29న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మ‌ర‌ణించాడు. సాధార‌ణ వ్యాయామం చేసిన త‌రువాత గుండెపోటు వ‌చ్చింది. వెంట‌నే బెంగుళూరులోని విక్రమ్ స్టూడియోకి వెళ్లి, కుటుంబ డాక్ట‌ర్ తో వైద్యం చేయించాడు. ఆ డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు స‌మీపంలోని ప్రైవేటు ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు ధ్రువీక‌రించారు. ఆ రోజున మ‌ధ్యాహ్నానం 2గంట‌లా 30 నిమిషాల‌కు అధికారికంగా పునీత్ మ‌ర‌ణాన్ని వెల్ల‌డించారు.