Site icon HashtagU Telugu

Karnataka Manifesto: మేనిఫెస్టోలో పెళ్లిళ్ల హామీ, కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ వినూత్నం

Karnataka Elections Manifesto By Jds Party

Karnataka Elections Manifesto By Jds Party

Karnataka Elections Manifesto by JDS Party : రైతే రాజు. ఆ రాజు బిడ్డలకు పెళ్లి కావడం కష్టం. వ్యవసాయం చేసే వాళ్లకు పెళ్లి కావడంలేదు. అందుకే కర్ణాటక (Karnataka) ఎన్నికల్లో మేనిఫెస్టో గా మారింది. అందరికి తిండిపెట్టే రైతన్న కుటుంబం అంటే అలుసు. నెలకు 10వేలు జీతం ఉండే వాళ్లకు పెళ్లి అవుతుంది. కానీ 50 ఎకరాల్లో వ్యవసాయం చేసే వాడికి పిల్లను ఇవ్వడం లేదు. ఇదీ ఇప్పుడున్న సమాజం పోకడ. అందుకే ఆ సమస్య తీవ్రతను గమనించిన జేడీఎస్ వ్యవసాయదారుడిని పెళ్లి చేసుకుంటే 2 లక్షల ప్యాకేజీని ప్రకటించింది. ఇదేదో నవ్వులాట ఆఫర్ అనుకుంటే పొరబాటు. రైతన్న కుటుంబానికి సమాజం ఇచ్చే గౌరవానికి ఇదో కొలమానం.

అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి కీలక హామీ ప్రకటించారు. అధికారంలోకి వస్తే.. రైతుల కొడుకుల‌ను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 2 ల‌క్ష‌లు అంద‌చేస్తామని చెప్పారు. కోలార్‌లో నిర్వహించిన ‘పంచ‌రత్న’ ర్యాలీలో కుమార‌స్వామి ఈ హామీ ఇచ్చారు.

‘‘రైతుల కొడుకులను పెళ్లి చేసుకునేందుకు యువ‌తులు సుముఖంగా లేర‌ని నా దృష్టికి వ‌చ్చింది. అందుకే రైతుల పిల్ల‌ల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు వారిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చిన యువ‌తుల‌కు మా పార్టీ అధికారంలోకి వస్తే రూ. 2 ల‌క్ష‌ల న‌గ‌దు అందిస్తుంది’’ అని చెప్పారు. రైతుల పిల్లల ఆత్మ గౌర‌వాన్ని కాపాడేందుకు ఈ ప‌థకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.

క‌ర్ణాట‌క (Karnataka) అసెంబ్లీ ఎన్నిక‌లు మే 10న జ‌ర‌గ‌నున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. 224 స్ధానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కనీసం 123 స్థానాలను సాధించాలని జేడీ(ఎస్‌) టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటిదాకా 93 మంది అభ్యర్థులను ప్రకటించింది. పెళ్లికాని వాళ్లకు పిల్లను ఇచ్చే పధకాలను పెట్టె వరకు రాజకీయం వచ్చింది .

వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితాన్ని సమాజం అనుభవిస్తుంది. జీ డీ పి లో వ్యవసాయం వాటా తగ్గినప్పుడే రూపాయి పతనం ప్రారంభం అయింది. అయినప్పటికీ రైతుకు ప్రోత్సహం లేదు. గిట్టుబాటు ధర ఇవ్వరు. రుణాలు ఇవ్వరు. సబ్సీడీలు తగ్గించుకుంటూ ప్రభుత్వాలు వచ్చాయి. ఫలితంగా రైతుకు వ్యవసాయం మీద మోజు తగ్గింది. ఇతర రాగాల వైపు పిల్లల్ని మార్చారు. వ్యవసాయం చేసే వాళ్లకు పిల్లను ఇవ్వాలి అంటేనే వెనుకాడే సమాజాన్ని నిర్మించాం. ప్రమాదం గా మారిన ఈ పరిణామాన్ని మార్చడానికి జేడీఎస్ ఒక ప్రయత్నం పెళ్లిళ్ల విషయంలో చేసింది. కానీ , ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వ్యవసాయం చేసే వాళ్లకు విలువ ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే రైతుకు , ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.

కేవలం 2 లక్షల రూపాయల పరిహారం కోసం ఏ ఆడ పిల్ల వ్యవసాయం చేసే వాడిని చేసుకోవడానికి ముందుకు రాదు. జీవితాంతం బాధ పడాలి అనే భావం నుంచి రైతును బయటకు తీసుకు రావాలి . అప్పుడే పెళ్లికి పిల్లను ఇవ్వడానికి ముందుకొస్తారు. అసలైతే సమస్యను జెడీఎస్ గుర్తించింది. మిగిలిన పార్టీలు మరో అడుగు ముందుకేసి రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా మానిఫెస్టో రూపొందించాలని కోరుకుందాం.

Also Read:  Diabetes : ఉదయాన్నే ఈ ఫుడ్స్ తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లోకి