Karnataka: కర్ణాటకలో కరెంటు కోతలపై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామిపై విద్యుత్ చౌర్యం కేసును నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీపావళి పండుగ సందర్భంగా బెంగుళూరులోని తన నివాసానికి విద్యుత్ దీపాలను అలంకరించేందుకు ఓ కరెంట్ స్తంభం నుంచి విద్యుత్‌ను అక్రమంగా తీసుకున్నారంటూ బెంగుళూరు విద్యుత్ సరఫరా సంస్థ కేసు నమోదు చేసింది.
విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ వినియోగించిన వ్యవహారంపై మంగళవారం బెస్కాం ఏఈఈ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో జయనగర పోలీసులు కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదుపై మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ తన నివాసాన్ని అలంకరించే బాధ్యతను ఓ ప్రైవేటు డెకొరేటర్‌కు అప్పగించగా, కేవలం టెస్టింగ్ కోసమే బయట నుంచి విద్యుత్తు తీసుకున్నారని వివరణ ఇచ్చారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.