Power Metres: ఏపీలో ఈ ఏడాదిలోనే వ్య‌వ‌సాయ మోట‌ర్ల‌కు మీట‌ర్లు – ఇంధ‌న శాఖ కార్య‌ద‌ర్శి

ఏపీలో ఈ ఏడాదిలోనే వ్య‌వ‌సాయ మోట‌ర్ల‌కు మీట‌ర్లు బిగించనున్న‌ట్లు ఇంధ‌న శాఖ కార్య‌ద‌ర్శి శ్రీకాంత్ తెలిపారు. డిస్కమ్‌లు చేపట్టిన టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగినా ఇటీవలే ముగిసిందని.

  • Written By:
  • Publish Date - February 20, 2022 / 07:09 PM IST

ఏపీలో ఈ ఏడాదిలోనే వ్య‌వ‌సాయ మోట‌ర్ల‌కు మీట‌ర్లు బిగించనున్న‌ట్లు ఇంధ‌న శాఖ కార్య‌ద‌ర్శి శ్రీకాంత్ తెలిపారు. డిస్కమ్‌లు చేపట్టిన టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగినా ఇటీవలే ముగిసిందని. దీంతో మీటర్‌ బిగింపు త్వరలో ప్రారంభమవుతుందని, అన్ని జిల్లాల్లో ఏకకాలంలో చేపడతామని ఆయ‌న తెలిపారు. 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, వాటికి 6,663 ఫీడర్ల ద్వారా పగటిపూట తొమ్మిది గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంపై ప్రభుత్వం సుమారు ₹7,715 కోట్ల సబ్సిడీని చెల్లిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ సబ్సిడీల ఖాతాలో రూ.9,717 కోట్లు చెల్లించబడ్డాయని పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరాలో 4,36,837 అంతరాయాలు ఉన్నాయని.. పంపిణీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వల్ల అది 2,02,496కి తగ్గిందని తెలిపారు.

వ్యవసాయ విద్యుత్‌ కోసం రాష్ట్రప్రభుత్వం సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకి)తో కుదుర్చుకున్న ఒప్పందంపై జాతీయ విద్యుత్‌ నియంత్రణ మండలి(సిఇఆర్‌సి)లో హియరింగ్‌ జరుగుతుందని చెప్పారు. నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టిపిసి)కుచెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర ఆర్థిక శాఖ చెల్లిస్తుందన్నారు.

తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలపై ఎలాంటి వివాదం లేదన్నారు. రూ.6,400 కోట్లు రావాలని, వీటిపై వడ్డీ తగ్గించాలని తెలంగాణ కోరుతుందని వివరించారు. తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇండిస్టియల్‌ డిమాండ్‌ పెరగడం వల్ల మార్కెట్‌లో ఎక్కువ బిడ్డింగ్‌ చేసి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవిద్యుత్‌ డిమాండ్‌ 204 మిలియన్‌ యూనిట్లు(ఎంయు) ఉందని, ఇందులో 34 ఎంయులను మార్కెట్‌ నుంచి సరాసరి యూనిట్‌ ధర రూ.5లకుపైబడి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవన్నారు. పగటి పూట అందించాల్సిన వ్యవసాయ ఉచిత విద్యుత్‌ సరఫరాలో సాంకేతిక లోపం ఏర్పడితే సరిచేసి అదేరోజు సరఫరా చేస్తున్నామని తెలిపారు.