Site icon HashtagU Telugu

Posts Over Chopper Crash: జనరల్ బిపిన్ రావత్ క్రాష్‌పై సోష‌ల్ మీడియాలో ఫేక్ పోస్టులు…ఎనిమిది మంది అరెస్ట్‌

Bipin

Bipin

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్,ఆయ‌న భార్య స‌హా ఇత‌ర అధికారుల మృతిపై సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారం చేస్తూ పోస్టులు పెడుతున్న ప‌లువురిని అరెస్ట్ చేశారు.దేశవ్యాప్తంగా ఎనిమిది మందిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్య‌క్తిని ప్ర‌భుత్వ ఉద్యోగం నుంచి స‌స్పెండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, గుజరాత్ , కర్ణాటక, రాజస్థాన్‌, త‌మిళనాడులో కేసులు న‌మోదైయ్యాయి.

రాజస్థాన్‌లో అత్యధిక అరెస్టులు జరిగాయి – ప్రమాదం జరిగిన గంటల్లో ఒకటి, శనివారం రెండు కేసులు న‌మోదు చేశారు. మనీష్ కుమార్ మీనా, జీవన్‌లాల్ నినామా అనే వ్యక్తులను ప్ర‌మాదంపై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తూ పోస్టులు పెట్టినందుకు ప్రతాప్‌గఢ్ పోలీసులు శ‌నివారం అరెస్ట్ చేశారు.ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ప్రతాప్‌గఢ్ ఎస్పీ అమృత దుహన్ తెలిపారు. అంతకుముందు జనరల్ రావత్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచితమైన వ్యాఖ్యలను పోస్టు చేసినందుకు రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో జవాద్ ఖాన్ (21)ని పోలీసులు అరెస్టు చేశారు. విమానం కూలిపోయిన కొన్ని గంటల తర్వాత ఈ వ్యాఖ్యలపై తాము అప్రమత్తమయ్యామని పోలీసులు తెలిపారు. ఖాన్‌ను సెక్షన్ 505 (2) కింద అరెస్టు చేసి…జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీకి పంపించామ‌ని టోంక్ సర్కిల్ ఆఫీసర్ చంద్ర సింగ్ తెలిపారు. పోలీసు కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామ‌ని.. ఖాన్ వ్యాఖ్యలు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతున్నాయని తెలిపారు.

గుజరాత్‌లో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మొదటి వ్యక్తి ని డిసెంబర్ 9న, మరొక వ్య‌క్తి రిటైర్డ్ పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ కుమారుడు ఫిరోజ్ దివాన్ ని అరెస్ట్ చేశారు. క్రాష్‌పై ఫేస్‌బుక్ లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు భరూచ్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) బృందం శుక్రవారం ఫిరోజ్ దివాన్‌ను అరెస్టు చేయ‌గా శ‌నివారం బెయిల్ పై విడుద‌లైయ్యాడు. దివాన్ పోస్ట్‌ను తొలగించారు కానీ అతని మొబైల్ ఫోన్‌లో స్క్రీన్‌షాట్‌లను ఉన్నాయ‌ని…ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఇన్‌స్పెక్టర్ K D మండోరా తెలిపారు.

డిసెంబర్ 9న గుజరాత్‌లోని అమ్రేలీ పోలీసులు క్రాష్‌కు సంబంధించి ఆరోపించిన పోస్ట్ పై శివ భాయ్ అహిర్ (44) అనే వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్లు 153A, 505(1), 295A కింద కేసు న‌మోదు చేశారు. ఈ విషయంపై గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవిని ట్విట్ట‌ర్ లో ప‌లువురు ట్యాగ్ చేసి… పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ విభాగం అహిర్ ని అరెస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో గిరిజన యువ నాయకుడు దుర్గేష్ వస్కలే ప్ర‌మాదంపై అస‌త్య‌ప్ర‌చారం చేయ‌డంపై పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ యువ‌కుడిపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ దంగోర్ ఖాండ్వా ఎస్పీ వివేక్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. అతను తరచూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తుంటాడని…జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ప‌లుచోట్ల హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంపై అనుచిత వ్యాఖ్య‌లు పోస్ట్ చేసినందుకు అరెస్ట్ లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌మాదంపై ఇప్ప‌టికే ద‌ర్యాప్తు జ‌ర‌గుతుంద‌ని ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది.ద‌ర్యాప్తు పూర్త‌యిన త‌రువాత అస‌లు ఏం జ‌రిగిందో తెలుస్తుంద‌ని ఐఏఎఫ్ తెలిపింది.