Sasikala: శశికళతోనే అన్నాడీఎంకేకు భవిష్యత్తా?

ఎప్పుడెప్పుడు పిలుస్తారా.. ఎప్పుడెప్పుడు పార్టీలోకి వచ్చేద్దామా అని శశికళ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 5, 2022 / 12:54 PM IST

ఎప్పుడెప్పుడు పిలుస్తారా.. ఎప్పుడెప్పుడు పార్టీలోకి వచ్చేద్దామా అని శశికళ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అన్నాడీఎంకేలో పరిణామాలను చూస్తుంటే.. ఆమెకు అనుకూలంగా మారుతున్నట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్ సెల్వం సమక్షంలోనే కార్యకర్తల నుంచి ఈ డిమాండ్ రావడంతో పార్టీ అధిష్టానం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పన్నీర్ సెల్వం పాల్గొన్న సమావేశంలో ఆ పార్టీ నేత.. తేని జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాన్.. శశికళ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నమ్మ వస్తేనే పార్టీ గెలుపుబాట పడుతుందని స్పష్టంగానే చెప్పేశారు. దీంతో పన్నీరు సెల్వంతోపాటు అక్కడున్న నేతలంతా ఒక్కసారిగా విస్తుపోయారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు పార్టీ నుంచి ఈ డిమాండ్లేమిటి అని ఆశ్చర్యపోయారు. పార్టీలో ఏమైనా లుకలుకలు మొదలయ్యాయా అని కంగారుపడ్డారు.

ఆమధ్యన ఓ నేతను సస్పెండ్ చేసినప్పుడు కూడా ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. తనను సస్పెండ్ చేసే అధికారంలో పార్టీలో ఎవరికీ లేదన్నారు. ఇప్పటికీ శశికళే పార్టీ చీఫ్ అని గట్టిగానే వాదించారు. దీంతో శశికళ పార్టీ పగ్గాలు చేపట్టాలన్న సంకేతాలు పార్టీ శ్రేణులు బలంగా వినిపిస్తున్నట్టయ్యింది. ఇప్పటికే అక్కడ డీఎంకే అధికారంలో ఉంది. దీంతో పార్టీని కూడా బలంగా మార్చుకుంటోంది. పైగా స్టాలిన్ పనితీరు ఆదర్శంగా ఉంది. అన్ని వర్గాల్లోనూ అభిమానం సంపాదిస్తోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ డీఎంకే దూసుకుపోయింది.

ఇప్పుడు అన్నాడీఎంకేలో ప్రజలను ఆకర్షించే నాయకుడు ఎవరూ లేరు. కొద్దొగొప్పో చిన్నమ్మకే ఆ పాపులారిటీ ఉంది. ఎప్పుడూ జయలలిత వెన్నంటే ఉండడం వల్ల ఆమెకు అది కలిసివచ్చింది. అందుకే జనాలను ఓట్లు అడగాలన్నా కచ్చితంగా ఆమె ఉండాల్సిందే అని అన్నాడీఎంకే శ్రేణులు ఆలోచిస్తున్నాయి. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం దీనికి సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఒకసారి చిన్నమ్మ ఎంట్రీ ఇస్తే.. ఇక పార్టీ మొత్తం ఆమె చేతుల్లోకి వెళ్లిపోతుందని వారి భయం. ఇలాంటి తరుణంలో శశికళ ఎలా పావులు కదుపుతారో చూడాలి.