South India : పొలిటిక‌ల్ డాన్ లు! ద‌క్షిణ భార‌త `డార్క్` య‌వ్వారం?

గాలి జ‌నార్థ‌న్ రెడ్డి,జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(South India) ఒకప్పుడు `క్విడ్ ప్రో కో ` స‌న్నిహితులు.

  • Written By:
  • Updated On - December 20, 2022 / 01:39 PM IST

మైనింగ్ డాన్ గాలి జ‌నార్థ‌న్ రెడ్డి, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒకప్పుడు `క్విడ్ ప్రో కో ` స‌న్నిహితులు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా కలుపుకుని ముగ్గురూ రాజ‌కీయ(Political) మిత్రులు కాబోతున్నారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. జాతీయ రాజ‌కీయాల్లో కీల‌కం కావాల‌ని కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అందుకోసం క‌ర్ణాట‌క‌, ఏపీ, బీహార్‌, మ‌హారాష్ట్ర‌ల‌ను ప్ర‌ధానంగా ఎంచుకున్నారు. ఆయా రాష్ట్రాల్లోని చిన్న‌చిత‌కా పార్టీల‌తో బీఆర్ఎస్ పొత్తుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ క్ర‌మంలో క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఇప్ప‌టికే జేడీఎస్ తో స‌యోధ్య కుదుర్చుకున్నారు. ఆ పార్టీకి ద‌క్షిణ క‌ర్ణాట‌క‌(South India)లోని కొంత భాగంలో మాత్ర‌మే ప్రాబ‌ల్యం ఉంది. ఉత్త‌ర క‌ర్ణాట‌క‌పై ప‌ట్టుకోసం గాలి జ‌నార్థ‌న్ రెడ్డి ద్వారా కొత్త పార్టీని ప్రమోట్ చేసిన‌ట్టు రాజ‌కీయ(Political) వ‌ర్గాల్లోని స‌రికొత్త టాక్‌.

గాలి మ‌ళ్లీ కొత్త పార్టీ

`కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష` పేరుతో గాలి జ‌నార్థ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. కురుబ కులం నేతను అధ్య‌క్షుడిగా పెట్ట‌డం ద్వారా కొత్త పార్టీని ముందుకు తీసుకెళ్లాల‌ని ఆయ‌న ప్లాన‌ట‌. కనీసం 25 నియోజకవర్గాల నుంచి బ‌రిలోకి దిగాల‌ని గాలి టార్గెట్‌గా చెబుతున్నారు. బ‌ళ్లారి, విజయనగరం, కొప్పల్, రాయచూర్, యాదగిరి, బీదర్ జిల్లాల్లో భారీసంఖ్యలో గాలికి మద్దతుదారులు ఉన్నారు. 2013లో యడ్యూరప్ప బీజేపీని వీడి కర్ణాటక జనతా పార్టీని పెట్టిన‌ప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి సోదరులు శ్రీరాములు సహాయంతో బీఎస్ఆర్ కాంగ్రెస్‌ని స్థాపించిన విష‌యం విదిత‌మే. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ బాగా న‌ష్ట‌పోయింది. ఆ త‌రువాత బీఎస్ ఆర్ పార్టీని విలీనం చేసిన గాలి ఇప్పుడు మ‌ళ్లీ కొత్త పార్టీని రిజిస్ట‌ర్ చేయ‌డం క‌ర్ణాట‌క‌తో పాటు ఏపీ, తెలంగాణాల్లో సంచ‌ల‌నం రేపుతోంది.

బీహార్ రాష్ట్రంలో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ `జ‌న్ సురాజ్‌` అనే కొత్త పార్టీని పెట్టారు. దాని వెనుక కేసీఆర్ ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. మ‌హారాష్ట్రలో శివ‌సేన పార్టీతో క‌లిసి న‌డిచేందుకు బీఆర్ఎస్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఏపీలో ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ద‌మైన బీఆర్ఎస్ అక్క‌డ పార్టీ ఆఫీస్ ను కూడా పెడుతోంది. రాజ‌కీయంగా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ మ‌ధ్య సాన్నిహిత్యం ఉంది. అన్న‌దమ్ముల మాదిరిగా అన్ని ర‌కాలుగా స‌హాయ, స‌హ‌కారాల‌ను పంచుకుంటున్నారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా అనుబంధం అన్ని ర‌కాలుగా 2019 నుంచి పెరిగింది. రాబోవు ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌డానికి అవ‌స‌ర‌మైన చోట బీఆర్ఎస్ ను ప్ర‌యోగించ‌డానికి కేసీఆర్‌, జ‌గ‌న్ స్కెచ్ వేస్తున్నార‌ని టాక్‌. సామాజిక‌, మ‌త ప‌ర‌మైన ఈక్వేష‌న్ రూపంలో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భావం ప్ర‌త్య‌క్షంగా కొంత ప‌రోక్షంగా మ‌రికొంత‌ ఉంటుంది. స‌రిహ‌ద్దు రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ ప్రాంతాల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌హ‌కారం బీఆర్ఎస్ పార్టీ తీసుకోనుంద‌ని తెలుస్తోంది.

బీ టీమ్ గా ద‌క్షిణ భార‌త దేశం(South India)

ఉత్త‌ర క‌ర్ణాట‌క ప్రాంతంలో గాలి జ‌నార్థ‌న్ రెడ్డికి అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయి. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బిజినెస్ లు ఎక్కువ‌గా బెంగుళూరు కేంద్రంగా ఉన్నాయ‌ని అంద‌రికీ తెలిసిందే. స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, గాలి జ‌నార్థ‌న్ రెడ్డికి వ్యాపార బంధం బ‌లంగా ఉంది. ఓబులాపురం మైనింగ్ కేసు అందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం. మూడు రాష్ట్రాల్లోనూ మూడు స్థంభాల‌ట ఆడేందుకు కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, గాలి జ‌నార్థ‌న్ రెడ్డి సిద్ధం అయ్యార‌ని రాజ‌కీయాల‌ను లోతుగా ప‌రిశీలించే వాళ్ల‌కు అర్థం అవుతోంది.

హైద‌రాబాద్ కేంద్రంగా ఆ ముగ్గురికి ఆస్తులు భారీగా ఉన్నాయి. అటు వ్యాపార ఇటు రాజ‌కీయ బంధం ముగ్గురి మ‌ధ్యా ప‌రోక్షంగా ఉంద‌ని వినికిడి. విచిత్రంగా గాలి, క‌ల్వ‌కుంట్ల‌, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బీజేపీకి బాగా స‌న్నిహితులు. ఇటీవ‌ల దాకా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఢిల్లీ కేంద్రంగా అన్ని విధాలా అండ‌గా ఉంది. ఇక వైసీపీకీ ఇప్ప‌టికీ బీజేపీతో అంట‌కాగుతోంది. బీజేపీలో ప‌నిచేసిన అనుభ‌వ‌శాలి గాలి జనార్థ‌న్ రెడ్డి. అంటే, ఆ ముగ్గురు బీజేపీ తానులోని ముక్కలే. ప్ర‌త్య‌ర్థి పార్టీలు అనుమానిస్తున్న‌ట్టు బీజేపీ బీ టీమ్ గా ద‌క్షిణ భార‌త దేశం(South India)లో ప‌నిచేస్తున్నారా? లేక‌ అదునుచూసి మోడీని దెబ్బ‌తీయాల‌ని తెర వెనుక ప్లాన్ చేస్తున్నారా? అనేది ఆస‌క్తిక‌రం.

Also Read : Political Alliance: టీడీపీ, బీజేపీ ‘పొత్తు’ భారతం