Political Party Banner : తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు అన్నా డీఎంకే ఫ్లెక్సీతో హల్చల్ చేయడం కలకలం రేపింది. నిబంధనలు ఉల్లంఘించి ఆలయం వద్ద రాజకీయ ప్రకటనలు చేయడంపై టీటీడీ స్పందించింది. ఫ్లెక్సీని ప్రదర్శించి, రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు, స్విమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూ, రోగుల సహాయకుల కోసం కొత్త సౌకర్యాలు ప్రారంభించారు.
- తిరుమలలో రెచ్చిపోయిన తమిళ యువకులు
- శ్రీవారి ఆలయం ముందు రాజకీయ పార్టీ బ్యానర్
- వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్
తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు రెచ్చిపోయారు. ఆలయం ఎదుట రాజకీయ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీతో హల్చల్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు తమిళనాడులోని అన్నా డీఎంకేకు సంబంధించి.. జయలలిత, పళని స్వామి ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీని విడుదల చేసి వీడియో తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అసలు ఈ ఫ్లెక్సీ అలిపిరిలో తనిఖీలు దాటి తిరుమలకు ఎలా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. తిరుమల ఆలయం దగ్గర భద్రతా సిబ్బంది ఎందుకు గమనించలేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ‘తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నాయకుల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీ బ్యానర్ ను టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ప్రదర్శించినట్లు మా దృష్టికి వచ్చింది. ఆ బ్యానర్ ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిసింది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ తెలియజేస్తోంది’ అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర, మాడ వీధుల్లో రాజకీయ పార్టీలకు సంబంధించి ఫ్లెక్సీలు, గుర్తులు, జెండాలు, ఇలా ఏవీ ప్రదర్శించకూడదు. అలాగే తిరుమలలో రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో రీల్స్ చేయకూడదని కూడా ఆదేశించారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర రోజూ మైక్‌లో భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ నిబంధనల్ని పట్టించుకోవడం లేదు.. వారికి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. టీటీడీ పదే, పదే హెచ్చరిస్తున్నా సరే కొందరు భక్తులు పద్ధతి మార్చుకోవడం లేదు. గతంలో నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసులు కూడా నమోదయ్యాయి.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్విమ్స్ సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించారు. ‘శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ను దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నాము. రూ.10.65 కోట్లతో 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించాము. ఇందులో మెడికల్ స్టోర్లు, జనరల్ స్టోర్లు, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్లు, కార్యాలయాలు, సమావేశ మందిరం ఉన్నాయి. రూ.4 కోట్ల 40 లక్షల వ్యయంతో 300 మంది రోగుల సహాయకులు వేచివుండేందుకు వీలుగా విశ్రాంతి భవంలోని 2, 3వ అదనపు అంతస్తులను ప్రారంభించాము’ అన్నారు.
ఇందులో రోగుల సహాయకులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో పాటు మరుగుదొడ్లు, లిఫ్టులు ఏర్పాటు చేశాము. టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్‌లో పలు భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేశాము. ఇందులో భాగంగానే సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను నిర్మించాము. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.. అనంతరం అన్ని ల్యాబ్లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాము. శ్రీ పద్మావతి ఆసుపత్రి ఎదుట గల మెడికల్ షాపును స్విమ్స్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిటిడి ఆధ్వర్యంలోని అన్ని ఆసుపత్రుల్లో రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషిచేస్తున్నాము అన్నారు టీటీడీ ఛైర్మన్.
