Air India Flight: బెంగళూరు నుంచి వారణాసికి వస్తున్న ఎయిర్ ఇండియా (Air India Flight) ఎక్స్‌ప్రెస్ విమానం (IX 1086)లో హైజాక్ యత్నం కలకలం సృష్టించింది. ఇద్దరు ప్రయాణికులు కాక్‌పిట్ తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. ఇందుకోసం వారు సరైన పాస్‌కోడ్‌ను కూడా నమోదు చేసినట్లు సమాచారం. అనుమానంతో అప్రమత్తమైన పైలట్ తలుపులు తెరవలేదు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందించారు. విమానం సురక్షితంగా వారణాసిలో ల్యాండ్ అయిన తర్వాత కాక్‌పిట్ తలుపు తెరవడానికి ప్రయత్నించిన ఇద్దరు ప్రయాణికులతో సహా మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
విమానంలో ఏం జరిగింది?
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సోమవారం ఉదయం బెంగుళూరు నుంచి బయలుదేరి వారణాసికి వస్తోంది. విమానం గాల్లో ఉన్నప్పుడు ఇద్దరు ప్రయాణికులు కాక్‌పిట్ గేటును తెరవడానికి ప్రయత్నించారు. పాస్‌కోడ్‌తో తెరుచుకునే ఆ తలుపుకు వారు సరైన పాస్‌కోడ్‌ను కూడా నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో పైలట్‌కు హెచ్చరిక అందింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ సీసీటీవీలో గమనించగా.. ఇద్దరు ప్రయాణికులు కనిపించారు. విమానం హైజాక్ అయ్యే అవకాశం ఉందని అనుమానించిన పైలట్ తలుపులు తెరవలేదు.
ఏటీసీకి సమాచారం.. భద్రతా సిబ్బంది అప్రమత్తం
వెంటనే పైలట్ ఈ విషయాన్ని ఏటీసీకి తెలియజేశారు. ఏటీసీ అధికారులు భద్రత కోసం విమానాశ్రయంలో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానం వారణాసిలోని బాబత్‌పూర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే, సీఆర్పీఎఫ్ జవాన్లు కాక్‌పిట్ తలుపులు తెరవడానికి ప్రయత్నించిన ఇద్దరితో సహా మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారిని బాబత్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. పోలీసులు, ఇతర నిఘా ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. వారణాసి డీసీపీ ఆకాష్ పటేల్ కూడా విచారణ కోసం అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం, భద్రతా సిబ్బంది ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనను సృష్టించింది.
