Devegowda : అమ్మో..ప్ర‌ధాని ప‌ద‌వి.! గౌడ‌ను వెంటాడిన భ‌యం!!

భార‌త ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని ఎవ‌రైనా వ‌ద్దంటారా...ఒక వేళ వ‌స్తే ప‌ర్మినెంట్ గా ఆ ప‌ద‌విలో కొన‌సాగాల‌ని స‌హ‌జంగా ఆశిస్తారు.

  • Written By:
  • Publish Date - December 7, 2021 / 03:39 PM IST

భార‌త ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని ఎవ‌రైనా వ‌ద్దంటారా…ఒక వేళ వ‌స్తే ప‌ర్మినెంట్ గా ఆ ప‌ద‌విలో కొన‌సాగాల‌ని స‌హ‌జంగా ఆశిస్తారు. కానీ, 1996వ సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఢిల్లీ రాజ‌కీయ ఘ‌ట్టాల‌ను నెమ‌రువేసుకుంటే…ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి చేప‌ట్టేందుకు సాహ‌సం ఎవ‌రూ చేయ‌లేక‌పోయారు. విధిలేని ప‌రిస్థితుల్లో దేవెగౌడ ఆ ప‌ద‌విని చేప‌ట్టాల్సి వ‌చ్చింది. ఆ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో పంచుకున్న మాట‌లు కాంగ్రెస్ పార్టీ ఆడిన భ‌యంకర రాజ‌కీయ గేమ్ కు నిద‌ర్శ‌నం. `ప్ర‌ధాన మంత్రిగా ఎంతో కాలం ఉండ‌లేం. కేవ‌లం ఒక సూట్ కేసుతోనే ఢిల్లీకి వెళ్తున్నాం. మీరు కూడా నాలాగే ఒక సూట్ కేసుతో పీఎంవో కార్యాల‌యంలో చేర‌డానికి రెడీ కండి..` అంటూ ఆనాడు సీఎం హోదాలో ఉన్న గౌడ త‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మీనాక్షిసుంద‌రంతో పంచుకున్న మాట‌లవి.

క‌ర్నాట‌క సీఎంగా దేవెగౌడ్ మంచి పరిపాల‌న సాగిస్తున్న రోజుల‌వి. ఆయ‌న ప్ర‌భుత్వానికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా మీనాక్షి సుంద‌రం ఐఏఎస్ ఉన్నాడు. కొన్ని ద‌శాబ్దాల పాటు సీఎంగా ఉండాల‌ని ఆశిస్తూ..సుప‌రిపాల‌న దిశ‌గా గౌడ అడుగులు వేస్తున్నాడు. ఆ స‌మ‌యంలోనే కేవ‌లం 13 రోజులు మాత్ర‌మే పీఎంగా ఉన్న వాజ్ పేయ్ ప్ర‌భుత్వం కూలిపోయింది. ప్ర‌త్యామ్నాయంగా యునైటెడ్ ఫ్రంట్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి సిద్ధం అయింది. ప్ర‌ధాని అభ్య‌ర్థిగా జ్యోతిబ‌సు, సుర్జీత్ సింగ్‌, క‌రుణానిధి, చంద్రబాబు నాయుడు, మురసోలి మారన్ త‌దిత‌రుల పేర్ల‌ను ప‌రిశీలించారు. చివ‌రి నిమిషంలో అనూహ్యంగా దేవెగౌడను ఖ‌రారు చేయ‌డం ఆయ‌నకే ఆశ్చ‌ర్యం క‌లిగించింది.
ఆ విష‌యం తెలుసుకున్న గౌడ స‌తీమ‌ణి చిన్న‌మ్మ భ‌య‌ప‌డింద‌ట‌. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మీనాక్షిసుంద‌రం ను పిలిచి మీరైనా వ‌ద్ద‌ని చెప్పండ‌ని వేడుకుంద‌ట‌. రెండేళ్ల నుంచి సీఎంగా మంచి పేరుతెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఢిల్లీకి ఎలా వెళ్లాలి. అక్క‌డ ఎవ‌రు తెలుసు. భాష కూడా రాదు. అక్క‌డ ఏ విధంగా నెగ్గుకు రాగ‌లం…ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి వ‌ద్ద‌ని చెప్పండ‌ని సుంద‌రంకు విన్న‌వించింద‌ట‌. ఆ స‌మయంలోనే ప్రధాని అభ్య‌ర్థిగా ఎన్నికైన గౌడ ఢిల్లీ నుంచి ఇంటికి చేరుకున్నాడు. సుంద‌రం, గౌడ, చిన్న‌మ్మ ముగ్గురూ ఒకే టేబుల్ మీద భోజ‌నం చేస్తూ ఢిల్లీకి ఒక సూట్ కేసుతో మాత్ర‌మే వెళుతున్నాను. నువ్వు కూడా ఒక సూట్ కేసు స‌ర్దుకుని పీఎంవో కార్యాల‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి రండ‌ని సుంద‌రంతో గౌడ అన్నాడ‌ట‌.


ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి వ‌స్తే సంతోషించ‌కుండా గౌడ ఎందుకు అలా నైరాశ్యంగా మాట్లాడాడంటే..అప్ప‌టి వ‌ర‌కు వారం పాటు ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన రాజ‌కీయ నాట‌కీయ ప‌రిణామాలు ప్ర‌ధాన కార‌ణం. 13 పార్టీల కూట‌మిగా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ను ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆనాటి రాష్ట్ర‌ప్ర‌తి శంక‌ర్ ద‌యాళ్ శ‌ర్మ ఆహ్వానించాడు. కానీ, ప్ర‌ధాని అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డానికి చాలా రోజులు టైం గ‌డిచింది. దీంతో అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నుంచి వాజ్ పేయ్ ను ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాడు.శంక‌ర్ ద‌యాళ్ శ‌ర్మ నిర్ణ‌యంపై లౌకిక పార్టీల అధిప‌తులు నిర‌సిస్తూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. యునైటెడ్ ఫ్రంట్ ప్ర‌భుత్వ రూప‌శిల్పి, సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌రికిష‌న్ సింగ్ సుర్జీత్ రాష్ట్ర‌ప‌తి మీద మండిప‌డ్డాడు. ఆర్ఎస్ఎస్ ప్ర‌తినిధిగా ఉండే వాజ్ పేయ్ ను ప్ర‌ధానిగా చేయ‌డానికి మిమ్మ‌ల్ని రాష్ట్ర‌ప‌తిని చేశామా? అంటూ శ‌ర్మ‌ను నిల‌దీశాడంట‌.

వామపక్ష పార్టీల మద్దతుతో రాష్ట్రపతిగా అప్పుడు ఎన్నిక‌య్యాడ క‌నుక‌నే ఆ విధంగా సుర్జీత్ ఆగ్ర‌హించాడు. KR నారాయణన్‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తిగా చేయాలనే షరతుతో శర్మ ను రాష్ట్ర‌ప‌తిగా సుర్జీత్ అంగీకరించాడు.
వాజ్ పేయ్ కేవ‌లం 13 రోజులు మాత్ర‌మే ప్ర‌ధానిగా ఉండ‌గ‌లిగాడు. ఆ త‌రువాత యునైటెడ్ ఫ్రంట్ త‌ర‌పున ప్ర‌భుత్వ ఏర్పాటు కు రాష్ట్ర‌ప‌తి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. తొలుత హరికిషన్ సింగ్ సుర్జీత్ త‌న అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాడు. ఆ తర్వాత వీపీ సింగ్ పేరును ప‌రిశీలించారు. కానీ, జ్యోతిబసు నుంచి వ్య‌తిరేక‌త వినిపించింది. 1989లో సింగ్ సారథ్యం వహించిన ప్రభుత్వాన్ని బ‌సు గుర్తు చేశాడు. అయిన‌ప్ప‌టికీ ట్రై చేయండ‌ని చెప్ప‌డంతో చంద్ర‌బాబుతో స‌హా యునైటెడ్ ఫ్రంట్ నేత‌లు ఆయ‌న ఇంటికి వెళ్లారు. బ‌య‌ట కూర్చొన్న వాళ్ల‌ను ప‌ల‌క‌రించిన సింగ్ ఇంటి లోపల‌కు వెళ్లి వెనుక ద్వారం ద్వారా వెళ్లిపోయాడట‌. దాదాపు రెండు గంటల తర్వాత, సింగ్ భార్య బయటకు వచ్చి ప్ర‌ధాన మంత్రిగా ఉండ‌డానికి ఆయ‌న‌కు ఇష్టంలేద‌ని చెప్పడంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయి వెనుతిరిగారు.

ఫ్రంట్ నేత‌లు అంద‌రూ జ్యోతిబసు తప్ప మరో ఆప్షన్ లేదని సుర్జీత్ వ‌ద్ద ప్ర‌తిపాద‌న ఉంచారు. బసు కూడా సంతోషంగా సమ్మతించాడు. కానీ, సీపీఐ పార్టీ అధిష్టానం రెండుసార్లు తిర‌స్క‌రించింది. వెంటనే, ఫ్రంట్ నేత‌ల‌ను సుర్జీత్ పిలిచాడు. అక్క‌డే జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు లాలూ యాదవ్, సుర్జీత్ ఉన్నారు. “మిస్టర్ గౌడ, మీరు బాధ్యతలు స్వీకరించాలి అని సుర్జీత్ నోట వినిపించ‌గానే ఆశ్చర్యపోయాడు గౌడ‌. “
“సార్, నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండేళ్లు కూడా కాలేదు. నా కెరీర్ అకస్మాత్తుగా ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపనివ్వదు. నేను మీలాగే ఉండాలనుకుంటున్నాను సార్. ఎన్నో ఏళ్లు కర్ణాటకను పాలించాలనుకుంటున్నాను. చరణ్ సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్‌లను కాంగ్రెస్ ఏం చేసిందో మనందరికీ తెలియదా. వారు నన్ను విడిచిపెడతారా? దయచేసి మీ మనసు మార్చుకోండి సార్. నాకు హిందీ కూడా రాదు. ఈ దేశం అంతటా ప్రయాణించలేను. నువ్వు మా పెద్దవాడివి, వేడుకుంటున్నాన‌ని గౌడ బ్ర‌తిమ‌లాడ‌ట‌. అయిన‌ప్ప‌టికీ ఆనాటి ప‌రిస్థితుల దృష్ట్యా త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ప్ర‌ధాని ప‌ద‌విని గౌడ చేప‌ట్టాల్సి వ‌చ్చింది. సీన్ క‌ట్ ..చేస్తే ఆయ‌న భ‌య‌ప‌డినంత జ‌రిగింది.