Tamil Nadu : జలవలయంలో చెన్నై.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన!

గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. రోడ్డు, వీధులున్నీ జలమయంగా మారాయి. ప్రధాన రహదారులు సైతం దెబ్బతిన్నాయి. ఎయిర్ పోర్ట్స్ లోని రన్ వేస్ నీటితో నిండిపోయాయి.

  • Written By:
  • Updated On - November 8, 2021 / 03:12 PM IST

గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. రోడ్డు, వీధులున్నీ జలమయంగా మారాయి. ప్రధాన రహదారులు సైతం దెబ్బతిన్నాయి. ఎయిర్ పోర్ట్స్ లోని రన్ వేస్ నీటితో నిండిపోయాయి. ఫలితంగా జనజీవనం స్తంభించింది. రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నైలోనే కాకుండా తమిళనాడులోని విల్లుపురం, కడలూరు, మైలదుత్తురై, నాగపట్టినం జిల్లాలు మరియు పుదుచ్చేరి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఆదివారం తీవ్ర వర్షాలు, నీటి ఎద్దడి కారణంగా తమిళనాడు రాజధాని సహ 22 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశాయి. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, వెల్లూరు, రాణిపేట్, తిరుపత్తూరు, నాగపట్నం, మైలాడుతురై, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, సేలం జిల్లాలతో సహా 14 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండో రోజు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద బాధితులకు స్వయంగా సాయం కూడా చేశారు.  తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిని చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ స్టాలిన్‌తో మాట్లాడి, దక్షిణాది రాష్ట్రంలోని రెస్క్యూ, రిలీఫ్ పనుల్లో కేంద్రం నుంచి అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. చెన్నైలో 15 జోన్లలో ఏర్పాటు చేసిన వంటశాలలు వరద ప్రభావిత ప్రాంతాల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం కోసం 3.36 లక్షల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది. చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ మాట్లాడుతూ తాగునీటి ఇబ్బందులు పడుతున్న పలు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపడుతామని అన్నారు.

తమిళనాడులో వర్షాలు ప్రధానంగా ఈశాన్య రుతుపవనాల వల్ల సంభవిస్తాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఏర్పడుతుంది. అక్టోబర్ 26 నాటికి ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయి. ఉత్తర భారతదేశంలో వర్షాలకు కారణమైన నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యం కారణంగా దాదాపు ఒక వారం ఆలస్యం అయింది. భారతదేశం రెండు రుతుపవనాల సీజన్లలో అత్యధిక వర్షపాతాన్ని పొందుతుంది, అయితే 75 శాతం వర్షం నైరుతి రుతుపవనాల నుండి వస్తుంది; ఈశాన్య రుతుపవనాలు మిగిలిన వాటిని కవర్ చేస్తాయి. నైరుతి రుతుపవనాలు తగ్గుముఖం పట్టడంతో ఈశాన్య రుతుపవనాల వానలు నైరుతి నుండి ఈశాన్య దిశగా గాలిలో మార్పుల కారణంగా ఏర్పడతాయి. తూర్పు-మధ్య అరేబియా సముద్రంలోని అల్పపీడనం గత ఆరు గంటల్లో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలింది.